అవినీతికి రిజిస్ట్రేషన్‌

17 Sep, 2019 13:45 IST|Sakshi
అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఏసీబీ మెరుపు దాడులు

రూ.2,07లక్షల  నగదు స్వాధీనం

తిరుపతి అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీబీ వలలో పడ్డాయి. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని రూ.2.07లక్షల సొమ్మును గుర్తించారు. తిరుపతి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో తిరుపతి ఏసీబీ డీఎస్పీ దేవా నంద్‌ శాంత్‌ తమ బృందంతో కలసిసోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు అంశాలపై సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా దేవానంద్‌ శాంత్‌ మాట్లాడుతూ లెక్క చూపని రూ.2.07లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 20 మంది డాక్యుమెంట్‌ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్‌ చేస్తున్నారని పక్కా సమాచారం ఉందన్నారు. దాంతోనే దాడులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు విజయశేఖర్, ప్రసాద్‌రెడ్డి, రవి ఎస్‌ఐ సూర్యనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.

విచారణ ఇలా కొనసాగింపు
ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఒక్కొక్కరిని కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆరా తీశారు. రోజుకు ఎన్ని రిజిస్టేషన్‌లు జరుగుతున్నాయి. సక్రమంగా ఉంటే ఎంత డిమాండ్‌ చేస్తున్నారు.. అక్రమంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఏ స్థాయిలో డిమాండ్‌ చేస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్స్‌ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా.. అనే అంశాలపై నిశితంగా విచారణ కొనసాగించారు.

ఉన్నత ఉద్యోగుల డైరెక్షన్‌లోనే లంచాలు?
డాక్యుమెంట్స్‌ అన్నీ సక్రమంగా ఉంటే పెద్దగా డిమాండ్‌ చేయకుండా కొంతమేరకు లంచాలు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే డాక్యుమెంట్లు సక్రమంగా లేకుంటే వాటిని రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. ఆ తర్వాత మధ్యవర్తులు క్రయ, విక్రయదారులతో సంప్రదించి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారని తెలిసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా