ఏసీబీకి చిక్కిన పీఆర్ ఇంజినీర్

24 Apr, 2016 02:28 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఇంజినీర్

 రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
 
మాడుగుల/ఎన్‌ఏడీ జంక్షన్ : రోడ్డు పనుల బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వల లో చిక్కుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.వి.ఆర్.కె.ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. వి.మాడుగుల మండల పరిధిలోని ముకుందపురం-బంగారుమెట్ట మధ్య రూ.35 లక్షల విలువైన రోడ్డు పనులను  విజయనగరం జిల్లా ఎస్. కోటకు చెందిన పోలినాయుడు అనే కాంట్రాక్టర్ చేపట్టారు. తొలి విడతగా రూ.28 లక్షల బిల్లు పొంది పని పూర్తి చేశారు.

మిగిలిన మొత్తం కోసం బిల్లు పెట్టుకున్నారు. అయితే దాన్ని మంజూరు చేయాలంటే  రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల పంచాయతీరాజ్ ఇంజినీరు సీహెచ్ అంబేద్కర్ బిల్లును తొక్కిపెట్టారు. బిల్లు కోసం గతంలోనే కొంత ముట్టజెప్పానని.. ఇప్పుడు అంత ఇవ్వలేనని తగ్గించాలని కాంట్రాక్టర్ కోరినా ఆయన అంగీకరించలేదు.

దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మళ్లీ ఇంజీనీర్ అంబేద్కర్ వద్దకు వెళ్లి రూ.42 వేలు ఇవ్వడానికి శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సొమ్ము తీసుకొని తాను ఉంటున్న విశాఖలోని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రాంతానికి రమ్మని ఇంజినీరింగ్ అధికారి సూచించారు. ఆ ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎన్‌ఏడీ కూడలిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.42 వేలు తీసుకుంటున్న ఇంజినీర్ అంబేద్కర్‌ను అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తి, రమేష్ పాల్గొన్నారు.  


 ఆ ఏఈ తీరే అంత..!
పంచాయతీరాజ్‌శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ గతేడాది ఆగస్టులో మాడుగుల మండల ఇంజినీరుగా బదిలీపై వచ్చినప్పటి నుంచీ అంబేద్కర్ వివాదాస్పదంగానే మసలుకుంటున్నారు. మండలంలో చేపట్టే అన్ని పనుల్లోనూ ఈ అధికారి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు విశాఖ నుంచి మండలపరిషత్ కార్యాలయానికి రాకపోకలతో బిల్లులకు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడేవారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మండలంలోని ప్రతి గ్రామానికి రూ.కోట్లతో సీసీ రోడ్లు మంజూరయ్యాయి. వీటిని నిర్మించిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు బిల్లులుకాకపోవడంతో లబోదిబోమనేవారు. దీంతో సీసీ రోడ్ల నిర్మాణంలో మాడుగుల మండలం జిల్లాలో వెనుకబడింది.
 

మరిన్ని వార్తలు