ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

25 Sep, 2013 02:15 IST|Sakshi
భానుపురి, న్యూస్‌లైన్ :క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలైంది. వ్యవసాయ భూమి టైటిల్ డీడ్ పుస్తకాల విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఓ గ్రామ రెవెన్యూ అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు చిక్కాడు. వివరాలు. నూతన్‌కల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన తిరుక్కవల్లూరు శ్రీనివాస్ మోతె మండలం సిరికొండ వీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ముదిగొండ జలంధర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట  6.27 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాస్‌పుస్తకాలను జలంధర్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారుల చేత చేయించుకున్నాడు.
 
  టైటిల్‌డీడ్ పుస్తకాల కోసం గ్రామ వీఆర్‌ఓ శ్రీనివాస్‌ను సంప్రదించాడు. వాటి కోసం వీఆర్‌ఓ శ్రీని వాస్ రూ.5వేలు డిమాండ్ చేశాడు. 15 నెలలుగా జలంధర్‌రెడ్డి టైటిల్‌డీడ్‌ల కోసం వీఆర్‌ఓ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో చేసేదిలేక జలంధర్‌రెడ్డి రూ.3వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు.  టైటిల్‌డీడ్‌లు ఇచ్చేందుకు ఇబ్బందులకు గురిచేసిన వీఆర్‌ఓను ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టిం చాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల వారిని సంప్రదించాడు. అందులో భాగంగా అధికారులు జలంధర్‌రెడ్డి మంగళవారం వీఆర్‌ఓ శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. 
 
 ఉదయం శ్రీనివాస్ పట్టణంలోని బాలాజీనగర్‌లో అద్దెకు నివాసముండే అతని ఇంటికి వెళ్లి జలంధర్‌రెడ్డి రూ.500ల నోట్లు రూ.3వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే ఇంట్లోకి వెళ్లి జలంధర్‌రెడ్డి ఇచ్చిన డబ్బులను వీఆర్‌ఓ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీఆర్వోను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, నల్లగొండ, హైదరాబాద్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ముత్తిలింగం, వెంకటరెడ్డి, ఏఎస్‌ఐ పాండు, సుధాకర్, జానీ, శ్రీకాంత్ ఉన్నారు.
 
 ప్రతి పనికి సప‘రేటు’
 మోతె: ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్‌ఓ శ్రీనివాస్ అవినీతి బాగోతం అంతా ఇంతా కాదని రైతులు పేర్కొం టున్నారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ ముక్కుపిండి వసూలు చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. భాగ పంపిణీ, టైటిల్‌డీడ్, పౌతి, ఆర్వోఆర్ కింద పట్టాలు తయారు చేయాలన్నా చేయి తడిపితే కానీ పని చేయడని రైతులు చెబుతున్నారు. ఈ తతంగం ఎవరి కైనా చెపితే వారి ఫైల్ ముందుకు కదలదని బెదిరించే వాడని తెలిసింది. 
 
మరిన్ని వార్తలు