ఈఎస్‌ఐ స్కామ్‌లో ముగిసిన ఏసీబీ విచారణ

27 Jun, 2020 14:22 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణంలో మూడో రోజు ఏసీబీ అధికారులు విచారణ ముగిసింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును జీజీహెచ్‌లో ఏసీబీ అధికారులు ప్రశ్నించగా, నేడు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. నేటితో కస్టడీ ముగియడంతో కీలక అంశాలపై ఏసీబీ ఆరా తీసినట్లు సమాచారం. పదిన్నర గంటల పాటు కొనసాగిన విచారణలో కొన్ని ప్రశ్నలకు అసంపూర్తిగా, మరికొన్నిటికి అబద్దాలు చెప్పినట్లు సమాచారం. మూడో రోజు కూడా అచ్చెన్నాయుడు విచారణకు సహకరించకపోవడంతో ఏసీబీ బృందం జీజీహెచ్‌ నుంచి తిరిగి వెళ్లిపోయింది. (‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్‌ ఏమిటి’)

నిన్న (శుక్రవారం) రెండోరోజు  ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్‌ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన టోల్‌ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు తెలిసింది. (ఈఎస్‌ఐ స్కాం మూలాలపై కన్ను)

మరిన్ని వార్తలు