రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ

13 Jun, 2020 04:39 IST|Sakshi
విశాఖలోని ఏసీబీ కార్యాలయంలో వివరాలను వెల్లడిస్తున్న ఏసీబీ జేడీ రవికుమార్‌ 

ఏసీబీ జేడీ రవికుమార్‌ వెల్లడి

ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాం

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు రమేష్‌కుమార్, విజయ్‌కుమార్, డిమ్స్‌ ఉద్యోగులు జనార్దన్, రమేష్‌బాబు, చక్రవర్తి కూడా అరెస్టు

సాక్షి, విశాఖపట్నం: ఈఎస్‌ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు పూర్వాపరాలను వెల్లడించారు.

మందుల స్కాంలో 19 మంది ప్రమేయం...
డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (డీఐఎంఎస్‌–డిమ్స్‌) విభాగంలో 2014–15 నుంచి 2018–19 వరకు జరిగిన కొనుగోళ్లపై విచారణ నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు  ప్రాథమికంగా నిర్ధారించింది. 
♦ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ నిమ్మాడలో అదుపులోకి తీసుకుంది. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు డాక్టరు సీకే రమేష్‌కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్‌ జి.విజయ్‌కుమార్‌ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసింది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న డిమ్స్‌ ఉద్యోగులు డాక్టర్‌ జనార్దన్, ఇ.రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్టు చేసింది. 
మార్కెట్‌ ధరకన్నా అధికంగా చెల్లింపులు..
♦ మందులు, ల్యాబ్‌ కిట్స్, శస్త్రచికిత్స పరికరాలు, ఫర్నిచర్, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోళ్లతో పాటు కాల్‌సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 
♦ మార్కెట్‌ ధర కన్నా 50 నుంచి 129 శాతం అధికంగా చెల్లించి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కై ఇ–టెండర్‌లో కాకుండా నామినేషన్‌ విధానంలో కొనుగోళ్లు జరిపారు.
♦ కొందరు ‘డిమ్స్‌’ ఉద్యోగులే తమ కుటుంబ సభ్యుల ద్వారా బినామీ కంపెనీలను సృష్టించారు. తప్పుడు ఇన్‌వాయిస్‌లు, బిల్లులతో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు.

ఈసీజీకి డబుల్‌కిపైగా చెల్లింపులు...
♦ టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి ఆదేశాలతో అప్పటి డిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమేష్‌కుమార్‌ టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
♦ టెలిమెడిసిన్‌కు సంబంధించి కాల్‌సెంటర్, టోల్‌ ఫ్రీ, ఈసీజీ సేవల ఒప్పందం లోపభూయిష్టంగా జరిగింది. ఇతర ఆస్పత్రుల్లో సుమారు రూ.200 మాత్రమే ఖర్చు అయ్యే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. 
♦ కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్‌కి కాకుండా సర్వీసు ప్రొవైడర్‌ మొత్తం రిజిస్టర్‌ ఐపీకి, ఫేక్‌ కాల్స్‌ లాగ్స్‌కి ఒక్కో కాల్‌కి రూ.1.80 చొప్పున బిల్లులు చెల్లించారు. 
♦ బయోమెడికల్‌ వేస్ట్‌ డిస్పోజబుల్‌ ప్లాంట్‌ ఏర్పాటులోనూ అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు