అవినీతి తోటలో.. విరగకాసిన కోట్లు!

24 Jul, 2014 02:47 IST|Sakshi
అవినీతి తోటలో.. విరగకాసిన కోట్లు!

 కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది?.. ఒక్కసారి ఉద్యానవన శాఖ పరిస్థితిని.. దాని అధికారిని చూస్తే తెలిసిపోతుంది. వనాలను సంరక్షించాల్సిన సదరు అధికారే వాటిని మేసేశారు. అవినీతి తోటలు సాగు చేసి కోట్లకు కోట్ల ఫలాలు పండించుకున్నారు. సొంతింటిని సుసంపన్నం చేసుకున్నారు. చివరికి పాపం పండింది. ఈయనగారి అక్రమాల చీడపై ఇటీవలే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఇంతలోనే ఏసీబీ రంగంలోకి దిగింది. ఏక కాలంలో ఆయన, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు జరిపి కోట్లాది రూపాయల అక్రమాస్తులను గుర్తించి, స్వాధీనం చేసుకుంది.
 
 శ్రీకాకుళం క్రైం: పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలు.. విలువైన ఫ్లాట్లు.. లాకర్లలో, ఇంటి బీరువాల్లో స్వర్ణాభరణాల ధగధగలు.. లక్షల్లో బయటివారికి అప్పు లు.. మరికొన్ని లక్షల విలువైన బీమా పాల సీలు.. సర్కారు జీతంపై ఆధారపడే ఒక జిల్లాస్థాయి అధికారికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయంటే దానర్థం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఏసీబీ అధికారులు ఆయనగారి వ్యవహారాలపై నిఘా పెట్టారు. అదను చూసి దాడులకు దిగారు. రూ. 8 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. ఇన్ని ఆస్తులు కూడగట్టిన ఆ అధికారి జిల్లా ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్(ఏడీ) ఆర్.వి.వి.ప్రసాద్.
 
 ఉదయం 5 గంటలకే దాడులు
 తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బుధవారం ఉదయం 5 గంటలకే ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు మరో ఆరుగురు బంధువుల ఇళ్లలో కూడ సోదాలు జరిపారు. శ్రీకాకు ళం పట్టణంలోని శ్రీ కల్కి గణపతి రెసిడెన్సీలో  ఉన్న ప్రసాద్ ఇంట్లోని రికార్డులు, బీరువాల్లో ఉన్న బంగా రం, ఆస్తుల పత్రాలు.. అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు జరిపిన ఈ దాడుల్లో 40 ఇళ్ల స్థలాలు, నాలుగు  ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మూడు బ్యాంకు లాకర్లలో 69 తులాలు,  
 
 ఇంట్లోని బీరువాల్లో మరో 11 తులాల బంగారు అభరణాలను కనుగొన్నామన్నారు. అలాగే బయటవారికి రూ. 25 లక్షల మేరుకు  అప్పులిచ్చినట్టు సూచించే పత్రాలు, రూ. 40 లక్షల బీమా పాలసీల బాండ్లు ఉన్నాయని వివరిం చారు. వీటితోపాటు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయన్నారు. వీటి విలువ సుమారు మూడు కోట్లు ఉండవచ్చని తెలిపారు. అయితే బయట మార్కెట్ విలువను బట్టి ఈ ఆస్తుల విలువ రూ.8 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులేనని నిర్థారణ కావడంతో ప్రసాద్‌ను అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. గురువారం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు  సమాచారం.
 
 బంధువుల ఇళ్లలో సోదాలు
  ఏడీ ప్రసాద్ ఇంటిపై దాడులు జరిపిన సమయంలోనే వారి బంధువుల ఇళ్లలోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు జరిపారు. శ్రీకాకుళం, సోంపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న ఆరుగురు బంధువుల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. ప్రసాద్ సోదరి అయిన శ్రీకాకుళం డీసీటీవో అనసూయ ఇంట్లోనూ సోదాలు జరిపారు. స్థానిక విశాఖ-బి కాలనీలో నివాసముంటున్న అనసూయ ఇంట్లో ప్రసాద్ ఆస్తులకు సంబంధించి ఏమైనా రికార్డులు, ఆధారాలు లభించవచ్చన్న ఉద్దేశంతో దాడులు చేశారు. సోంపేట మండలం మామిడిపల్లి, విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఉంటున్న బంధువుల ఇళ్లలోనూ సోదా లు జరిపారు.  
 
 వంశధార నిర్వాసితుల నిధుల్లో అవకతవకలు
 1992లో ఉద్యానవన శాఖలో చేరిన ప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగారు. డిప్యుటేషన్లపై వివిధ విభాగాల్లో పనిచేశారు. అందులో భాగంగా వంశధార నిర్వాసితుల పునరావాస విభాగంలోనూ విధులు నిర్వర్తించారు. ఇక్కడే ఆయన భారీ అవకతవకలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉద్యానవన శాఖలో ఏడీగా భాద్యతలు స్వీకరించిన తరువాత కూడా అదే పంథా కొనసాగించారు. ఆ శాఖకు అందే నిధుల్లో చాలా వరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
 మామిడిపల్లిలో ఏసీబీ సోదాలు
 సోంపేట(మామిడి పల్లి): ఉద్యానవనశాఖ ఏడీ ఆర్.వి.వి.ప్రసాద్ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు అతని బంధువులు ఉంటున్న మామిడిపల్లిలోని ఇంటిలో కూడా సోదాలు చేశారు.  సాహుకారి దివాకర్ ఇంటికి బుధవారం ఉదయం చేరుకున్న ఏసీబీ సీఐ శ్రీనివాసరావు తదితరులు సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించారు.  
 
 సాక్షి వరుస కథనాలకు స్పందన
 ఉద్యానవన శాఖలో ప్రసాద్ పాదుగొల్పిన అవినీతిపై ఉద్యానవనంలో అవినీతి చీడ శీర్షికతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. వారం రోజుల కిందట వచ్చిన ఈ కథనాలు ఆ శాఖలో పెద్ద దుమారం రేపాయి. అయితే ఎప్పట్నుంచో ప్రసాద్‌పై అందుతున్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఆయన వ్యవహారాలపై కన్నేసి ఉంచారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో వచ్చిన కథనాల ఆధారంతో దర్యాప్తును వేగవంతం చేసి. బుధవారం దాడులకు పూనుకున్నారు. ఈ దాడుల్లో ఏలూరు డీఎస్పీ వెంకటేశం, శ్రీకాకుళం సీఐ అజాద్, విజయనగరం సీఐ లక్ష్మోజి, ఏలూరు సీఐ విల్సన్, కాకినాడ సీఐ రాజశేఖర్, విజయవాడ సీఐలు నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా