దోచుకో.. దాచుకో

9 Sep, 2018 08:33 IST|Sakshi

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారుల దాడి  

పూలకుండీలో ముడుపుల స్వీకరణ 

రూ.10,010 నగదు స్వాధీనం 

ఏఎంవీఐ, హోంగార్డ్‌పై కేసు 

రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ)లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనకు బాగా అలవాటుపడిపోయారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి.. కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం భయపడడం లేదు. ఆన్‌లైన్‌ వ్యవస్థ తీసుకొచ్చినా అవినీతి తగ్గడం లేదు. అక్రమ వసూళ్ల రూపంలో దోచుకుని.. వాటిని దాచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు.  

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు రవాణా శాఖలో అవినీతి అక్రమాలను తగ్గించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఏడెనిమిది రకాల సేవలు తప్ప మిగిలిన 76 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఇక పారదర్శక పాలన అందుతుందని అందరూ భావించారు. కానీ అది తప్పని నిరూపిస్తున్నారు కొంతమంది సిబ్బంది. తమ వాటా తమకు అందితే తప్ప ఫైల్‌ ముందుకు పోదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీని వలన పేరుకు ఆన్‌లైన్‌ అయినా జరిగేదంతా ఆఫ్‌లైనేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఆగని అక్రమాలు.. 
శాఖలో మార్పులు తీసుకొస్తున్నా.. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అక్రమాలు తగ్గడం లేదు. తాజాగా శనివారం తెల్లవారు జామున పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అనధికారికంగా ఉన్న రూ.10వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇదే పెనుకొండ చెక్‌పోస్టుపై 2016లో రెండుసార్లు, గతేడాది ఒక సారి దాడులు చేసి అవినీతిని బట్టబయలు చేశారు. గత నెలలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడానే అభియోగంపై గుంతకల్లు ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రవింద్రనాథ్‌రెడ్డికి సంబంధించి మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.30కోట్లకు పైగా విలువజేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన మరవకముందే పెనుకొండ ఆర్టీఏ చెక్‌ఫోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం కలవరపాటుకు గురి చేస్తోంది. 

బాధ్యులపై చర్యలు నిల్‌ 
అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై రోడ్డు రవాణా శాఖలో చర్యలు ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన వారు మరుసటి రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరైన ఘటనలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అవినీతి, అక్రమాలను ఏ స్థాయిలో వెనుకేసుకొస్తున్నారో తెలిసిపోతుంది.  

పెనుకొండ: అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న పెనుకొండ ఆర్టీఓ  చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో సీఐలు ప్రతాపరెడ్డి, చక్రవర్తి శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడుల్లో ఏసీబీ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షేక్షావలి, విరూపాక్ష, హరిబాబు పాల్గొన్నారు. మధ్యవర్తులుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ డీఈ నరసింహ, అంజనీకుమార్‌ వ్యవహరించారు. తనిఖీల్లో లెక్కలు లేని రూ.10,010 నగదును అధికారులు స్వాధీనం చేసుకుని.. డ్యూటీలో ఉన్న ఏఎంవీఐ మధుసూదనరెడ్డితో పాటు హోంగార్డ్‌ చాంద్‌బాషాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. 

అక్రమ వసూళ్లకు తెరలేపారిలా.. 
చెక్‌పోస్ట్‌లో ఇరవై రోజులుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఇక ఏమి చేసినా సాక్ష్యాధారాలు ఉండవని ఇక్కడి సిబ్బంది రెచ్చియపోయారు. బెంగళూరు, అనంతపురం వైపు వెళ్లే లారీల డ్రైవర్లు డబ్బులు – రికార్డులు తీసుకురాగా చెక్‌పోస్ట్‌ సిబ్బంది నగదును చేతికి తీసుకోకపోవడంతో వారు సమీపంలోని పూలకుండీలో వేసి వెళ్లారు. ప్రతి డ్రైవర్‌ అదేవిధంగా చేశాడు. ఏసీబీ డీఎస్పీ ఇదంతా నిశితంగా పరిశీలించారు. 

ఎంవీఐలకు చురకలు 
చెక్‌పోస్టులో సీసీ కెమెరాలు చెడిపోయి ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. మరమ్మతు చేయించుకోకుండా మూడు వారాలైనా పట్టించుకోవడం లేదంటే డబ్బు వసూలు కోసమే ఇలా చేశారు కదా అంటూ ఎంవీఐలకు ఏసీబీ అధికారులు చురకలంటించారు. ఓ మహిళా ఎంవీఐ తాను ఐదు రోజుల క్రితమే  ఇక్కడికి వచ్చానని చెప్పగా.. డీఎస్పీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏసీబీ అధికారులు వచ్చిన విషయాన్ని పసిగట్టిన ప్రైవేట్‌ వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు