దేవాదాయ శాఖలో అవినీతి జలగ

6 Jun, 2017 16:21 IST|Sakshi
దేవాదాయ శాఖలో అవినీతి జలగ
► ఈఓ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు
► రూ.కోటికి పైగా అక్రమాస్తుల గుర్తింపు
► తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
 
తణుకు: దేవాదాయ శాఖలో ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఓ అధికారిని  ఏసీబీ అధికారులు గుర్తించారు. తూర్పుగో దావరి జిల్లా పెద్దాపురంలో దేవాదాయశాఖకు చెందిన రాజా వత్సవాయి సు బ్బు, బుచ్చమ్మ ఆశ్రమం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న చీమలకొండ సా యిబాబు నివాసంతోపాటు కార్యాల యం, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు చేశారు.

ఆశ్రమంలో అన్నదానం జరగకుండా జరిగినట్టుగా రికార్డులు చూపిస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణల కారణంగా ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ప్రాథమిక సమాచారం మేరకు సాయిబాబు కూడబెట్టిన రూ.90 లక్షల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు అధికారులు చెబుతుండగా ఆయన స్థిరాస్తుల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం వేకువజాము నుంచి మొదలైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. సాయిబాబును మంగళవారం కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. 
 
మొదట్నుంచీ ఆరోపణలే..
రెండేళ్లుగా పెద్దాపురం సత్రానికి ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు తణుకు మండలం కోనాల, ముద్దాపురం గ్రూపు ఆలయాలకు ఇన్‌చార్జి ఈవోగా పదిహేనేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు పెంటపాడు మండలం బైరాగిమఠం (సత్రం) ఈఓగా పనిచేసిన ఆయనపై గతం నుంచి అవినీతి అరోపణలు ఉన్నాయి. ఆరుళ్ల సాయిగా అతడిని పిలుస్తుంటారు. ఇరగవరం మండలం రేలంగి స్వగ్రామం కాగా తణుకు పట్టణంలోని బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నారు.
 
అంతేకాకుండా మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, అపార్టుమెంట్‌లోని ప్లాటు ఉన్నాయి. పెద్దాపురంలోని కార్యాలయంతోపాటు భీమవరంలోని ఆయన బావమరిది ఇల్లు, రేలంగి, తణుకులో స్నేహితుడి ఇళ్లలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు అవినీతి ఆరోపణలు ఆధారంగా కొద్దికాలంగా అతడి కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఏసీబీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ అనుమతితో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని ఏ కకాలంలో దాడులు చేశారు. 
 
ఇల్లే కార్యాలయంగా..
సోదాల సమయంలో కోనాల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 35 ఎకరాల భూముల డాక్యుమెంట్లు, పాస్‌ పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కార్యాలయ రికార్డులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన అధికారులకు ఇంటినే కార్యాలయంగా వాడుకుంటున్నానని సాయిబాబా చెప్పడం కొనసమెరుపు. వీటితోపాటు కుటుంబ సభ్యుల 14 బ్యాంకు ఖాతాల పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్‌ చేశారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ విలేకరులకు చెప్పారు. కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇంట్లోకి ఎలా వచ్చాయనే వివరాలు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సోదాల్లో డీఎస్పీ గోపాలకృష్ణతోపాటు సీఐలు విల్సన్, బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. 
 
దేవాదాయ శాఖలో కలకలం
దేవాదాయశాఖలో ఈఓగా పనిచేస్తున్న చీమలకొండ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించడం ఆ శాఖలో కలకలం రేపింది. సోమవారం వేకువజాము నుంచి తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాలు ఆ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. 
మరిన్ని వార్తలు