ఏసీబీ వలలో వీఆర్వో

21 Dec, 2014 02:02 IST|Sakshi
ఏసీబీ వలలో వీఆర్వో

పెద్దారవీడు : డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ సంఘటన పెద్దారవీడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం సాయంత్రం జరిగింది. ఏసీబీ డీఎస్పీ మూర్తి కథనం ప్రకారం.. తోకపల్లెకు చెందిన రైతు కనకం పెద్ద కోటయ్య పాస్ పుస్తకం ఇటీవల పోయింది. డూప్లికేట్ పాస్ పుస్తకం కోసం వీఆర్వో బి.అచ్చయ్యను ఆయన కుమారుడు సుబ్బారావు సంప్రదించాడు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎఫ్‌ఆర్‌ఐ కాపీతో పాటు వీఆర్వో రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు.

మొదటి విడతగా రూ.2 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.6 వేలు ఇస్తేనే డూప్లికేట్ పాస్ పుస్తకం ఇస్తానని చెప్పటంతో సుబ్బారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అందులో భాగంగా సుబ్బారావు డబ్బులు తీసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. డబ్బుతో సమీపంలోని పాత తహశీల్దార్ కార్యాలయానికి రావాలని సుబ్బారావుకు వీఆర్వో అచ్చయ్య సూచించాడు. అక్కడికి వెళ్లగానే రూ.6 వేల నగదు తీసుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి అచ్చయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోను అరె స్టు చేసి ఒంగోలు తరలించినట్లు డీఎస్పీ మూర్తి తెలిపారు. ఆయనతో పాటు సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు ఉన్నారు.

8 నెలల నుంచి తిరుగుతున్నా : సుబ్బారావు
నా పాస్ పుస్తకం పోయి 8 నెలలైంది. అప్పటి నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. సిబ్బంది అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. వీఆర్వోతో మాట్లాడుకుంటే పని అయిపోతుందని కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆయన రూ.9 వేలు అడగటంతో రూ.8 వేలకు ఒప్పందం చేసుకుని మొదటి విడతగా రూ.2 వేలు ఇచ్చా. మిగిలిన రూ.6 వేలు ఇస్తేనే డూప్లికేట్ పాస్‌పుస్తకం మంజూరు చేస్తానని వీఆర్వో చెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించా.

మరిన్ని వార్తలు