ఏసీబీ దాడులతో హడల్‌

25 Jan, 2020 11:58 IST|Sakshi

రేణిగుంట, వడమాలపేట

తహసీల్దార్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

పలు రికార్డులు స్వాధీనం

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏళ్ల కొద్దీ పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు... చేయితడిపితే చకచకా పనులు...లేదంటే నెలల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి...ఈ పరిస్థితి జిల్లాలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఉందని ప్రజల ఆరోపణ. ఆ కార్యాలయాల చుట్టూ పలు పనుల నిమి త్తం కాళ్లరిగేలా తిరిగితిరిగి విసిగి వేసారిపోయిన ప్రజలు మరికొందరు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమని ముఖ్య మంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రకటించడమే కాకుండా అవినీతిపరుల సమాచారం ప్రభుత్వం దృష్టికి తేవడానికి 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన      విషయం విదితమే.  అయితే తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి మూలాన ఏళ్లకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు. అవి నీతి అధికారులపై చివరకు 14400 నంబర్‌కు ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులకు పూనుకున్నట్టు తెలుస్తోంది.

లంచావతారాల భరతం పట్టేందుకు..
లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. జిల్లాలోని రేణిగుంట, వడమాలపేట తహసీల్దార్ల కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆ కార్యాలయాల్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్,  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను సేకరించి వారిని విచారణ చేశారు. అలాగే కార్యాలయాల వద్ద ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ముమ్మర తనిఖీలు చేశారు. కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన తరువాత ఉన్నతాధికారులకు నివేదికలు పంపి తదుపరి విషయాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా జిల్లా ఏసీబీ అడిషినల్‌ ఎస్పీ శ్రీనివాసులు, ఆ శాఖ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

ఉలిక్కిపడ్డ రెవెన్యూ
అవినీతి నిరోధక శాఖ దాడులపై రెవెన్యూ శాఖ ఉలిక్కిపడింది. ఈ దాడులపై జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పక్క మండలాల రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఏ సమయంలో ఏ కార్యాలయంపై దాడులు చేస్తారోనని ఉద్యోగులు హడలిపోయారు. ఈ దాడులు మరికొన్ని చోట్ల జరిగే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు