సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

15 Nov, 2018 13:53 IST|Sakshi
సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ

రూ.1,24,230  స్వాధీనం

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల : పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి స్వామి దేవాలయం వద్ద ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై బుధవారం  ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో కార్యాలయంలోని సిబ్బం ది.. ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నుంచి రూ.1,24,230లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రిజిస్ట్రేషన్, స్టాంపులు, ఈ సీల్‌లతోపాటు ఇతరత్రా పనులపై వచ్చే వ్యక్తుల నుంచి కార్యాలయసిబ్బంది లంచం కింద డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు.

ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ పక్రియను కేవలం చలానా రూపంలోనే చెల్లించేలా చర్యలు చేపట్టిందన్నారు. అయితే ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను అదనపు సిబ్బందిగా నియమించుకుని వారి ద్వారా, డాక్యుమెంట్ల రైటర్స్‌ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఈ రోజు చేసిన సోదాలల్లో కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్‌వ్యక్తులు, డాక్యుమెంట్ల రైటర్స్‌ నుంచి రూ.1,24,230ల నగదను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. విచారణ అనంతరం చర్యలు చేపడుతామన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడులలో డీఎస్పీ నాగరాజుతోపాటు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ రామచంద్ర పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు