కంచే చేను మేసె!

20 Mar, 2020 10:18 IST|Sakshi

అటవీ సంపద సొమ్ము చేసుకుంటున్న ఇంటిదొంగలు 

స్మగ్లర్లతో కుమ్మక్కై   కోట్లకు పడగలెత్తిన  అధికారులు 

ఏక కాలంలో నలుగురు డీఆర్వోల నివాసాల్లో  ఏసీబీ దాడులుఅటవీ శాఖలో కలకలం 

అధికారులతో సీఎఫ్‌ఓ అత్యవసర సమావేశం 

సాక్షి, తిరుపతి: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. బోయకొండ సమీపంలోని అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన కేసులో డీఎఫ్‌ఓ, ముగ్గురు రేంజర్లు, ఒక సెక్షన్‌ ఆఫీసర్‌ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసింది. ఈ సంఘటన మరువక ముందే.. అటవీశాఖలో పనిచేసే నలుగురు డీఆర్వోల నివాసాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో కుమ్మ క్కై కోట్లకు పడగలెత్తారని ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు వీరు సహకరించారనే అనుమానాలున్నాయి.

అక్రమార్కుల నుంచి ముడుపులు 
జిల్లాలో శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం విస్తారంగా ఉన్న విషయం తెలిసిందే. చిత్తూరు అటవీ రేంజ్‌ పరిధిలో  విలువైన మైనింగ్‌ లభ్యమవుతుంది. అటవీ సంపదను రక్షించేందుకు నియమించిన డీఎఫ్‌ఓ చక్రపాణి, మరో నలుగురు అటవీ అధికారులు మాధవరావు, మదన్‌మోహన్‌రెడ్డి, ఈశ్వరయ్య, రవిబాబు బోయకొండ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ రవాణాకు అనుమతులు ఇచ్చారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అటవీ సరిహద్దులనే మార్చివేసి అక్రమార్కుల నుంచి భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో బయటపడడంతో వారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ సంఘటన మరువక ముందే మరో నలుగురు అటవీ అధికారుల నివాసాల్లో గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించారు.

ఎర్రదొంగలతో కుమ్ముక్కు 
శేషాచలం అటవీ పరిధిలో నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్రమంగా తరలిపోవడానికి కొందరు ఇంటి దొంగల సహకారం ఉందనే విషయం అధికార వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి. అటవీ, టాస్క్‌ ఫోర్స్‌లోని కొందరు అధికారుల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు లోడ్లు, ఆరు కోట్లుగా సాగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాలో భాగస్వామ్యులుగా ఉన్న కొందరు అధికారులు కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అందులో భాగంగా గురువారం ఏసీబీ అధికారులు అటవీశాఖలో పనిచేసే డీఆర్వోలు వెంకటాచలపతి నాయుడు, బాలకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, మాధవరావు నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా విడిపోయి నలుగురి నివాసాలతో పాటు బెంగుళూరు, చిత్తూరు, చంద్రగిరి, రాయచోటిలో ఉన్న వారి బంధువులు, స్నేహితుల నివాసాల్లో అర్థరాత్రి వరకు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో వెంకటాచలపతి నాయుడుకు రూ.5 కోట్లు విలువచేసే ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఆరు అంతస్తుల భవనం, అన్నారావు కూడలిలో ఐదు అంతస్తుల భవనం, గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలో షాపింగ్‌ కాంప్లెక్స్, శ్రీనివాసపురంలో గోదాము ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అదే విధంగా నగదు, బంగారు ఆభరణాలు, మరి కొన్ని డాకుమెంట్లను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది.

అటవీశాఖలో కలకలం 
ఏసీబీ దాడులతో అటవీశాఖలో కలకలం రేపుతోంది. అధికారులే స్మగ్లర్లకు సహకారం అందిస్తున్న విషయం వెలుగు చూడడంతో మరి కొందరు ఇంటి దొంగల్లో కలవరం మొదలైంది. ఏసీబీ దాడుల నేపథ్యంలో సీఎఫ్‌ఓ గురువారం రాత్రి అటవీశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడులకు దారితీసిన కారణాలను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.    

మరిన్ని వార్తలు