కోట్లకు పడగెత్తిన ‘గోవిందు’డు!

5 Feb, 2020 11:43 IST|Sakshi
ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ షకీలా భాను సమక్షంలో గోవిందు ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు

మాకవరపాలెం పీఏసీఎస్‌ స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

నర్సీపట్నంతో పాటుఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు

ఆదాయానికి మించి రూ.1.75 కోట్ల ఆస్తులున్నట్టు గుర్తింపు

ఆస్తులు సీజ్, నిందితుడు గోవిందు అరెస్టు:ఏసీబీ అడిషనల్‌ ఎస్పీషకీలాభాను వెల్లడి

నర్సీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేస్తేచాలు సంబంధిత అధికారుల అక్రమాస్తులను పెకిలించి, వారి నిజస్వరూపాలను బయటపెడుతోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మంగళవారం అదే జరిగింది. మాకవరపాలెం పీఏసీఎస్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు రైతుల నుంచి లంచాలు తీసుకొని కోట్ల రూపాయల ఆస్తులను కూటబెట్టినట్టు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేశారు. ఈ సందర్భంగా గోవిందు ఆదాయానికి మించి 1.75 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఏసీబీ అడిషనల్‌ఎస్పీ షకీలాభాను కథనం మేరకు..
మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు పలు అక్రమాలకు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అదే మండలానికి చెందిన గవిరెడ్డి చక్రవర్తి, తమరాన ఎర్రనాయుడు, బంగారు ఎర్రినాయుడుల ఆరోపణ. గోవిందు రుణ మాఫీలో రైతులను మోసం చేసి అక్రమాస్తులు కూడబెట్టారని, రైతులకు రుణాలు ఇవ్వకుండా తనే తీసుకుని మోసం చేసినట్టు ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ షకీలాభాను, డీఎస్పీ రంగరాజుల ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. నర్సీపట్నం, మాకవరపాలెం, బలిఘట్టం, గిడుతూరు, రామన్నపాలెంలలో గోవిందుకు సంబంధించిన ఆస్తులను సోదా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. అనంతరం ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ షకీలాభాను విలేకరులతో మాట్లాడారు. స్టాఫ్‌ అసిస్టెంట్‌ శీరంరెడ్డి గోవిందు వద్ద ఆదాయానికి మించి కోటి 75 లక్షల రూపాయల విలువైన అక్రమాస్తులున్నట్టు గుర్తించామన్నారు. వీటిలో 2019లో బలిఘట్టంలో కొనుగోలు చేసిన 323, 295 చదరపు అడుగుల ఇంటి స్థలాలు, మాకవరపాలెం మండలం రామన్నపాలెంలో వ్యవసాయ భూమి 8.44 ఎకరాలు, 87 సెంట్ల ఇంటి స్థలం, భార్య కృష్ణవేణి పేరుతో బలిఘట్టంలో 2014లో 39 సెంట్లు, 2019లో 30 సెంట్ల ఇంటిస్థలాలు ఉన్నాయన్నారు. అలాగే రూ. 55.88 లక్షల విలువైన వందకు పైగా ప్రాంసరీనోట్లు, రూ. లక్ష విలువైన మార్ట్‌గేజ్‌ డీడ్, 45,288 రూపాయల బ్యాంక్‌ బ్యాలన్స్, రూ. 87 వేలు విలువ గల గృహోపకరణాలు, 347 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంట్లో రూ. 28 వేల నగ దు, హీరో హోండా మోటారు సైకిల్‌ ఉన్నట్టు గుర్తించామని వివరించారు. దీనికి సంబంధించి ఆస్తులను సీజ్‌ చేసి, గోవిందును అరెస్టు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సోదాల్లో సీఐలు గఫూర్, అప్పారావు, రమేష్, లక్ష్మణమూర్తిలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన గోవిందు నివాసం ఉంటున్న ఇల్లు
మాకవరపాలెంలో కలకలం
మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ స్టాఫ్‌ అసిస్టెంట్‌ శీరంరెడ్డి గోవింద ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. పీఏసీఎస్‌ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గోవిందపై రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నర్సీపట్నంతోపాటు తన స్వగ్రామమైన గిడుతూరులోని సోదరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మండలంలో ఉదయం ఏడు గంటలకు ముందే ప్రారంభమైన ఈ సోదాల్లో భాగంగా మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ సీఈవో శెట్టి గోవింద ఇంటిలో డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం 8.30 గంటలకు పీఏసీఎస్‌ తాళాలు తీయించిన డీఎస్పీ.. పర్సన్‌ ఇన్‌చార్జి పాశపు నాగేశ్వరరావు సమక్షంలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ గోవిందకు చెందిన వివరాలను పరిశీలించారు. గోవింద ఎప్పుడు విధుల్లో చేరాడు, ఏఏ కేటగిరీల్లో పని చేశారో ఆరా తీశారు. 1994లో నైట్‌ వాచ్‌మన్‌గా చేరిన గోవింద 1999 నుంచి 2009 వరకు క్లర్క్‌గా, ప్రస్తుతం స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు ఏసీబీ సీఐ శ్రీనివాస్‌ వివరాలు సేకరించి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే గోవింద విధులు, రుణాల మంజూరు ఎలా చేశారనే విషయాన్ని సోదాల సమయంలో పీఏసీఎస్‌కు వచ్చిన రైతులను కూడా అడిగితెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు ఈ సోదాలను కొనసాగించారు. అంతకు ముందు పీఏసీఎస్‌కు పక్కనే ఉన్న గ్రామ సచివాలయంలో గోవిందపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కడైన కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన సుర్ల కన్నబాబును సీఐ విచారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు