సంక్షేమంలో అవినీతి సామ్రాట్‌

11 Nov, 2018 10:31 IST|Sakshi

అవినీతికి అడ్డాగా సాంఘిక సంక్షేమ శాఖ 

చేయి తడిపితేనే ఫైళ్లకు కదలిక 

నగదు డిపాజిట్లకు రెక్కలు 

బ్యాక్‌లాగ్‌ పోస్టుల పేరుతో దండకాలు 

నెల్లూరు(అర్బన్‌): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్‌ వెల్ఫేర్‌) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్‌ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్‌మాల్‌ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. 

 జిల్లాలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్‌లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి  తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు.   

వసూళ్లకు శ్రీకారం 
 ఆ శాఖకు చెందిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. 

నాయుడు
పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 

17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. 

డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి
మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు.  గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. 

బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే 
అక్టోబర్‌ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్‌ కాలేదు. 

తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్‌ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్‌చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్‌ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. 

భారీగా ఆస్తులు గుర్తింపు 
ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్‌ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది.

 డీడీ ఉద్యోగ ప్రస్థానాలు
దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్‌ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్‌ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్‌లో నెల్లూరు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. 

మరిన్ని వార్తలు