ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

11 Oct, 2019 10:02 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : తెలుగుగంగ ప్రాజెక్ట్  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ నరసింహం ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. లక్ష్మీనరసింహం నివాసంతోపాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగాయి. నెల్లూరు, కావలి, రాజమండ్రి, ఒంగోలులో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి, ఒంగోలులో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

1989 ఆగస్టు 9వ తేదీన పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌)గా ప్రకాశం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన రెవెన్యూశాఖకు బదిలీ అయి నెల్లూరు జిల్లాకు వచ్చారు. 1995లో నెల్లూరు జిల్లా పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2002లో తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. నెల్లూరు, జలదంకి, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో పనిచేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ల్యాండ్‌ అక్విజేషన్‌ (భూ సేకరణ) విభాగంలో సోమశిలలో పనిచేశారు. 2012లో రాజంపేట, 2014–17 వరకు కావలి ఆర్డీఓగా విధులు నిర్వహించారు.

2018 నుంచి తెలుగుగంగ ప్రాజెక్ట్‌ రాపూరు ఎస్‌డీసీగా పనిచేస్తూ బుధవారం జరిగిన బదిలీల్లో చిత్తూరు జిల్లా కేఆర్‌ఆర్‌సీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు డైకస్‌రోడ్డులో నివాసం ఉంటున్నారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనం రెవెన్యూ శాఖలో అడుగిడిన అనంతరం ఆయన తన అక్రమార్జనకు తెరలేపారు. పనిచేసిన ప్రతిచోట భారీగా ఆస్తులను కూడబెట్టారు. ప్రధానంగా తహసీల్దార్, ఆర్డీఓగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు భార్గవ్‌ పేర్లుపై ఆస్తులను కొనుగోలు చేశారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌శాంతో నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గురువారం తెల్లవారుజామున ఆరు బృందాలుగా విడిపోయి నెల్లూరు డైకస్‌రోడ్డులోని ఆయన ఇంటితో పాటు, బాలాజీనగర్‌లోని స్నేహితుడు కృష్ణారెడ్డి, జలదంకి మండలం అగ్రహారంలోని స్నేహితుడు ప్రభాకర్‌ ఇంట్లో, స్వగ్రామం కలవల్ల గ్రామంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఆయన అత్త ఇళ్లు, నెల్లూరులోని కార్యాలయంలో ఏకకాలంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు.

రూ.కోట్లలో ఆస్తులు గుర్తింపు..

 • ఏసీబీ సోదాల్లో లక్ష్మీనరసింహం, ఆయన భార్య, కుమారుడి పేరుపై ప్రభుత్వ మార్కెట్‌ ధరల ప్రకారం రూ.4,14,80,000 మేర ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. గుర్తించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 • లక్ష్మీనరసింహం నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరులో 2008లో రూ.33,075 విలువ చేసే 252 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు
 • ప్రకాశం జిల్లా కందుకూరులో 2006లో రూ.34 వేల వంతున ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.  

భార్య పేరుతో..

 • లక్ష్మీనరసింహం భార్య విజయలక్ష్మి పేరుతో 2013లో నెల్లూరు డైకస్‌రోడ్డులో రూ 26,30,200లతో జి+2 హౌస్‌ నిర్మాణం చేశారు. 
 • విజయలక్ష్మి పేరుతో 1999లో నెల్లూరు రూరల్‌ మండలం గుండ్లపాళెంలో రూ.27వేలు విలువ చేసే 33 అంకణాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. 
 • విజయలక్ష్మి పేరుతో 2018లో గుంటూరు జిల్లా తుళ్లూరులో రూ .8.55 లక్షలు విలువ చేసే ప్లాటును కొనుగోలు చేశారు. 
 • 2007లో కందుకూరులో రూ.52 వేలు విలువ చేసే వ్యవసాయభూమి కొనుగోలు చేశారు
 • పొదలకూరు మండలం భోగసముద్రంలో 2006లో రూ.1.29 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు
 • పొదలకూరు మండలం భోగసముద్రంలో 2007లో రెండు దఫాలుగా రూ .2.04 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు
 • పొదలకూరు మండలం బోగసముద్రంలో 2012లో రూ. 30 వేలు విలువ చేసే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. 

కుమారుడు పేరుతో..

 • లక్ష్మీనరసింహం కుమారుడు భార్గవ్‌ పేరుపై కావలిలో రూ. 2,98,57,000 విలువతో 605 గజాల స్థలంలో జి+5 షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.10 లక్షలు అడ్వాన్స్‌ను సైతం చెల్లించారు.
 • 2013లో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.18.20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 
 • 2013లో నెల్లూరు రూరల్‌ మండలం కనుపర్తిపాడులో రూ.2.14 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 
 • 2012లో రూ. 6 లక్షలు వెచ్చించి టాటా ఇండికా విస్టా కారు కొన్నారు.
 • అదే ఏడాది రూ.45 వేలు వెచ్చించి మహీంద్ర డ్యూరో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించి వాటి తాలుకు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
 • వీటితో పాటు రూ. 18 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, రూ.4.50 లక్షల నగదు, రూ.15 లక్షలు విలువ చేసే 650 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో రూ.2 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాలో సంచలనం 
స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

బదిలీ ఉత్తర్వులు అందుకునే లోపే..
ఇదిలా ఉంటే ఈ నెల 9వ తేదీన జరిగిన బదిలీల్లో లక్ష్మీనరసింహం చిత్తూరు జిల్లా కేఆర్‌ఆర్‌సీకి బదిలీ అయ్యారు. గురువారం ఆయన బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దాడులు చేయడం, ఆయన్ను అరెస్ట్‌ చేయడం గమనార్హం. ఈ సోదాల్లో నెల్లూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌బాబు, తిరుపతి ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, విజయశేఖర్, ప్రకాశం ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. రాఘవరావు, తూర్పుగోదావరి ఇన్‌స్పెక్టర్‌ తిలక్, తిరుపతి ఎస్సై విష్ణు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా