కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలోఇష్టారాజ్యం

25 Jan, 2020 11:23 IST|Sakshi
తహసీల్దార్‌ రవికుమార్‌ ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

ప్రైవేటు వ్యక్తుల హవా

తహసీల్దార్‌ డిజిటల్‌ కీ కూడా వారి వద్దే..

పత్తాలేని పలు రిజిష్టర్లు

ఏసీబీ సోదాల్లో బట్టబయలు

కార్యాలయ సిబ్బంది నుంచి రూ.15,480 స్వాధీనం

కర్నూలు,(న్యూటౌన్‌): కల్లూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యం నెలకొంది. తహసీల్దార్‌ రవికుమార్‌ ఏకంగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమించుకున్నారు. అత్యంత కీలకమైన డిజిటల్‌ కీ సైతం ప్రైవేటు వ్యక్తికి అప్పగించారు. అలాగే ప్రజలకు అందించే సేవలకు ఉద్దేశించిన పలు రిజిష్టర్లను నిర్వహించడం లేదు. ఈ విషయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)  అధికారుల సోదాల్లో బట్టబయలైంది. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 ఏర్పాటు చేసి..ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి అక్రమాలు ఎక్కువైనట్లు టోల్‌ఫ్రీ నంబరుకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ ఇన్‌చార్జ్‌ డీఎస్పీలు జనార్దన్‌నాయుడు, తేజేశ్వర్‌రావు నేతృత్వంలో సీఐ వెంకటకృష్ణారెడ్డి, సిబ్బంది విస్తృత సోదాలుచేపట్టారు.

ఉదయం 11 నుంచి రాత్రి ఏడు గంటల దాకా కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. తహసీల్దార్‌ ల్యాప్‌టాప్‌ను అధికారులు పరిశీలించారు. కంప్యూటర్‌ సెక్షన్, డిప్యూటీ తహసీల్దార్‌ చాంబర్, వీఆర్‌ఓల చాంబర్లలోనూ తనిఖీలు చేశారు. ఐదుగురు ఆఫీసు సిబ్బంది, ఐదుగురు వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి అక్రమంగా కలిగివున్న రూ.15,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ సొంతంగా ఇద్దరు అనధికారిక వ్యక్తుల (ఎన్‌.సతీష్, యు.రంగస్వామి)ను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమించుకున్నట్లు గుర్తించారు. వీరికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తున్నట్లు తేలింది. అలాగే తహసీల్దార్‌ వద్దే ఉండాల్సిన అత్యంత కీలకమైన ‘డిజిటల్‌ కీ’ ఓ ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌కు అప్పగించినట్లు గుర్తించారు.

సోదాల్లో వెల్లడైన ఇతర అంశాలు
106 ఈ–పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయకుండా డిప్యూటీ తహసీల్దార్‌కు చెందిన అల్మారాలో ఉంచేశారు.
మీసేవ దరఖాస్తులకు సంబంధించిన రిజిష్టర్‌ నిర్వహించలేదు. చాలావరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు.
స్పందన, పర్సనల్‌ క్యాష్, గన్‌ లైసెన్స్, ట్రెజరీ బిల్లుల రిజిష్టర్ల ఊసే లేదు. అసైన్డ్‌ భూముల రిజిష్టర్‌ నిర్వహణ సక్రమంగా లేదు.

ఫిర్యాదులపై ఆరా
ఏ సేవల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. సిటిజన్‌ చార్టరులో పేర్కొన్న విధంగా సేవలు సక్రమంగా అందుతున్నాయా, లేదా?  పనులు చేయడంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం తిరుగుతున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్‌లో పొలం వివరాలు నమోదు చేయడం లేదని, మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా పని కావడం లేదంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. తాము గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు