కర్షకున్ని వేధించి..ఏసీబీకి చిక్కి..

25 Jan, 2014 06:21 IST|Sakshi

నిజామాబాద్‌క్రైం/ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన ముస్కు చిన్న రాజారెడ్డి పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లారు. నాలుగేళ్లపాటు అక్కడ కష్టపడ్డా లాభం లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. తనకున్న ఆరు ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. ప్రస్తుతం ఈయన పొలంలో రెండు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. 16 కేవీ ట్రాన్స్ ఫార్మర్‌పై ఓవర్‌లోడ్ కారణంగా మోటార్లు చెడిపోతుండడంతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌కోసం ఇరవై రోజుల క్రితం దేగాం ఏఈ గోవర్ధన్‌ను కలిశారు. అయితే రూ. 20 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేస్తానని సదరు ఏఈ తెగేసి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చిన్న రాజారెడ్డి పేర్కొన్నా వినలేదు. పైసా తగ్గినా కుదరదన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఆయన స్వగ్రామానికి వెళ్లిపోయారు. తోటి రైతులతో విషయం చెప్పారు. వారు ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. దీంతో ఆయన ఏసీబీకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే గురువారం గ్రామానికి వచ్చిన ఏఈని రైతు చిన్న రాజారెడ్డి కలిశారు. రూ. 17 వేలకు బేరం కుదుర్చుకున్నారు.
 
 ఫలానా చోట..
 ‘తాను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా పవర్‌హౌస్ కార్యాలయంకు వెళ్తున్నానని, అక్కడికి డబ్బులు తీసుకుని రావాలని’ ఏఈ చెప్పాడు. చిన్నరాజారెడ్డి శుక్రవారం పవర్‌హౌస్‌కు వెళ్లి ఏఈను కలిశాడు. అయితే చౌరస్తాలోని సలీం హోటల్‌కు వెళ్లమని, అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటానని ఏఈ చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి వెళ్లి రైతు వద్దనుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్‌పీ సంజీవ్‌రావు, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, రఘనాథ్‌రెడ్డిలు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏఈని శనివారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్‌పీ తెలిపారు. అవినీతి అధికారిని పట్టించిన రైతు రాజారెడ్డిని మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయకుండా, డబ్బుల కోసం పీడించే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు