హాస్టల్స్‌లో ఏసీబీ తనిఖీలు

31 Jul, 2018 13:44 IST|Sakshi
పాత తిరువూరు బీసీ హాస్టల్‌ విద్యార్థినులను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌

హాస్టళ్లు అధ్వానం.. రికార్డుల్లో అవకతవకలు

గుర్తించిన ఏసీబీ అధికారులు

జిల్లాలోని తిరువూరు, గుడ్లవల్లేరు బీసీ బాలికల హాస్టల్స్‌లో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు.  తిరువూరులో మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందట్లేదని, నాసిరకంగా ఆహారపదార్థాలుంటున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని పరిశీలించారు.

కృష్ణా, తిరువూరు: విద్యార్థినులకు సరిపడా ఆహారం అందించకపోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటంతో పాటు హాస్టలును అధ్వానంగా నిర్వహిస్తున్న తిరువూరు బీసీ కళాశాల బాలికల వసతిగృహ మేట్రన్‌ రమాదేవిపై ఏసీబీ అధికారులు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు ఫిర్యాదు చేశారు.  సోమవారం ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు పలు లోపాలను కనుగొన్నారు.  సోమవారం 23 మంది విద్యార్థినులు మాత్రమే హాజరవగా, 27మందికి రేషన్‌ వినియోగించినట్లు రికార్డులో నమోదు చేసి నిధులు మేట్రన్‌ దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విలేకరులకు తెలిపారు.  హాస్టలు ఆవరణ పరిశుభ్రంగా లేనందున విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, మేట్రన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించక, విధులకు గైర్హాజరవుతుండటంతో హాస్టలు నిర్వహణ సరిగా లేదని పేర్కొన్నారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు చికెన్, గుడ్లు, పెరుగు, పండ్లు సరఫరా చేయకుండానే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారని, పలు రిజిస్టర్ల నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులకు కాస్మోటిక్స్‌ కూడా ఇవ్వట్లేదని, వాస్తవంగా ఉన్న స్టాకుకు, రికార్డులకు పొంతన లేదని కూడా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడించారు.

గుడ్లవల్లేరు బీసీ బాలికల హాస్టల్‌లో..
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులోని బీసీ బాలికల హాస్టల్‌లో ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. హాస్టల్‌లో విద్యార్థునులే సమాచారం ఇవ్వటంతో సోమవారం వేకువజాము నుంచే ఏసీబీ సీఐలు కె.వెంకటేశ్వర్లు, జి.కెనడీ తమ బృందంతో కలసి హాస్టల్‌లో సోదాలు చేపట్టారు. హాస్టల్‌లో తొమ్మిదిమంది విద్యార్థునులను సీఐలు విచారించగా అన్నం నాణ్యత ఉండటం లేదన్నారు. చపాతీలను మెనూ ప్రకారం ఇవ్వటం లేదని, పనులు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రోజుకు 10లీటర్ల పాలకు గానూ ఆరు లీటర్లు మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఐలు వార్డున్‌ వి.వి.శివలక్ష్మిని విచారించగా తమకు సిబ్బంది తక్కువగా ఉన్నారని, వంట మనిషి విద్యార్థినులతో కూరగాయలను కోయించిన మాట వాస్తవమేనని చెప్పారు. బాత్‌ రూమ్‌లు కూడా బాగోలేనట్లుగా విచారణలో తేటతెల్లమైంది. విద్యార్థునులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐలు వెంకటేశ్వర్లు, కెనడీ నమోదు చేసుకున్నారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని చెప్పారు.

తతిరువూరు బీసీ హాస్టల్‌లో..
తిరువూరు: స్థానిక పాతతిరువూరులోని వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతిగృహంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.  మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందట్లేదని, నాసిరకంగా ఆహారపదార్థాలుంటున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది హాస్టల్లోని రికార్డులు స్వాధీనం చేసుకుని తనిఖీ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. మేట్రన్‌ రమాదేవి స్థానికంగా నివసించట్లేదని, అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారని విద్యార్థినులు అధికారుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అనారోగ్య కారణంగా గానీ,  సెలవురోజుల్లో గానీ ఇళ్లకు వెళ్ళిన విద్యార్థినులకు హాజరు వేసి వారి పేరిట రేషన్‌ కూడా ఖర్చు చేసినట్లు చూపినట్లు  ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల సవరించిన మెనూ ప్రకారం మాంసాహారం, కోడిగుడ్లు విద్యార్థినులకు అందట్లేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు