సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు

3 Aug, 2018 13:16 IST|Sakshi
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌

హాస్టళ్ల దుస్థితిపై విస్మయం

అందుబాటులో లేని వార్డెన్లు

వారి స్థానంలో ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణ  

ఈపూరు: ఈపూరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో గుంటూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌ శాంతో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్‌ వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లా సంక్షేమశాఖ అధికారికి సమాచారం అందించారు. విద్యార్థులు పడుతున్న అవస్థలను దగ్గర నుంచి గమనించారు. వసతి గృహాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో  అసహనం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించారు.

వార్డెన్ల స్థానంలో ప్రవేటు వ్యక్తులు..
ఎస్టీ, బీసీ వసతి గృహాలను పరిశీలించిన అధికారులు అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్‌ సిబ్బందిని చూసి నివ్వెరపోయారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వార్డెన్లు సక్రమంగా పనిచేయకుండా వారి స్థానంలో ప్రైవేట్‌ వ్యక్తులను రోజు కూలీగా నియమించి పని చేయిస్తున్నారు. ఇంత జరుగతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

అధ్వాన పరిస్థితి..
ఎస్టీ హాస్టల్‌ విద్యార్థులు భోజనం ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక మరుగుదొడ్డిలో వచ్చే కుళాయిలను వాడుకుంటున్నామని, స్వచ్ఛమైన తాగునీరు లేక వాటినే తాగాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. బీసీ హాస్టల్స్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని విన్నవించారు. అన్నం ముద్దగా చేస్తున్నారని, ఉడకని కూరలు పెడుతున్నారని, నీళ్ల మజ్జిగ పోస్తున్నారని విద్యార్థులు చెప్పగా.. అధికారులు వాటిని ప్రత్యక్షంగా చూశారు.

తెల్లవారే వరకూ..
ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో విలేకర్లతో మాట్లాడుతూ వసతి గృహాల దుస్థితి అధ్వానంగా ఉందని, వార్డెన్లు అందుబాటులో లేరన్నారు. తెల్లవారే వరకు వసతి గృహంలోనే బస చేస్తామని, వార్డెన్లు రాని పక్షంలో మూడు వసతి గృహలను సీజ్‌ చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు