ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

20 Nov, 2013 23:20 IST|Sakshi

 జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్ :
 పట్టణం సమీపంలో బీదర్ చౌరస్తా వద్ద గల ఆర్టీఏ చెక్ పోస్టుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చెక్ పోస్టులో సోదాలు నిర్వహించి అదనంగా ఉన్న రూ. 81 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్‌పీ సంజీవ్‌రావ్ విలేకరులకు వివరించారు. ఆర్టీఏ రమేష్ బాబు బీదర్ చౌరస్తాలో గల చెక్ పోస్టులో ఇద్దరు ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తాము మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ సమయంలో రమేష్ బాబుతో పాటు ఆయన నియమించుకున్న ఇద్దరు ఏజెంట్లు పాషా, రహమాన్‌లు కూడా చెక్‌పోస్టులో ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.60 వేలు, ఏ లెక్కా లేని మరో రూ. 21 వేలు మొత్తం రూ.81 వేలును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెక్‌పోస్టులోనే మరో 91,300 వేలు లభించగా.. అవి ప్రభుత్వానికి సంబంధించినవిగా గుర్తించినట్లు వివరించారు. అధికారి ఇంట్లో సోదాలు చేయగా రూ.13 వేలు దొరికాయని, ఆ డబ్బులు తన జీతానికి సంబంధించినవిగా రమేష్ బాబు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్న రమేష్‌బాబుతో పాటు విధుల్లో ఉండాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు రవీందర్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డిలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరైనా అధికారులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే 94404 46155 కు సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కే శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు