బాబుకు నోటీసులిస్తే ఖబడ్దార్

11 Jun, 2015 02:39 IST|Sakshi

* కేసీఆర్‌కు మంత్రులు అచ్చెన్న, దేవినేని హెచ్చరిక
* రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేస్తే తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అక్రమాలను రోజుకొకటి చొప్పున బహిర్గతం చేస్తామని మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తమకు సంబంధం లేదని, చంద్రబాబును దెబ్బతీసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకేస్తే తాము వందడుగులు ముందుకేస్తామని పేర్కొన్నారు. రాజకీయపార్టీలన్నీ కలసి టీడీపీని, చంద్రబాబును దెబ్బతీసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నాయని ఆరోపించారు. బుధవారం సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారందరి ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు చంద్రబాబుతోపాటు టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారు.

అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు, విపక్ష కాంగ్రెస్ నేతల ఫోన్‌లను కూడా ట్యాప్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆధారాలుంటే కేసీఆర్‌పై కేసు ఎందుకు నమోదు చేయట్లేదని విలేకరులు ప్రశ్నించగా.. కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, కేంద్రం స్పందించకపోతే తామే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసి.. ఫోన్‌ట్యాపింగ్‌పై విచారణ చేస్తామని ఆయన బదులిచ్చారు.

రేవంత్‌రెడ్డి  కేసును పక్కదోవ పట్టించేందుకు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారా? అన్న ప్రశ్నకు.. రేవంత్ తప్పు చేసుంటే అనుభవిస్తారని, ఆయన కేసుతో తమకు సంబంధం లేదని, కోర్టు విచారణలో ఉన్నందున దానిపై మాట్లాడనని అచ్చెన్నాయుడు చెప్పారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నది చంద్రబాబును కాదని.. ఐదు కోట్ల మంది తెలుగువారినని చెప్పారు.

మరిన్ని వార్తలు