రోడ్డు ప్రమాదంలో.. ఏజేసీ దుర్మరణం

18 Dec, 2013 03:10 IST|Sakshi

 బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ (ఏజేసీ) టి.ఎ.జయచందర్ (57) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొంది.
 
 ఈ ఘటనలో ఏజేసీ జయచందర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుమారుడు సందీప్(24), డ్రైవింగ్ చేస్తున్న రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్(30)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... ఏజేసీ జయచందర్ తన వ్యక్తిగత పని నిమిత్తం కుమారుడు సందీప్‌తో కలిసి సోమవారం సాయంత్రం రమేష్‌గౌడ్ సంబంధీకులకు చెందిన బొలెరో వాహనంలో అనంతపురం నుంచి కర్నూలు వెళ్లారు.
 
 పని ముగించుకొని అదే రోజు రాత్రి అనంతపురానికి తిరుగు పయనమయ్యారు. అనంతపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వడియంపేట వద్దకు రాగానే ఫ్లైఓవర్‌పై బొలేరో వాహనం డివైడర్‌ను ఢీకొంది. డ్రైవింగ్ చేస్తున్న రమేష్‌గౌడ్ వేగాన్ని అదుపు చేసుకోలేకపోవడంతో డివైడర్‌పైనే దాదాపు 120 అడుగుల దూరం వరకు వెళ్లి బ్రిడ్జిని ఢీకొంది. దీంతో ముందు సీట్లో కూర్చున్న ఏజేసీ జయచందర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్‌గౌడ్, ఏజేసీ కుమారుడు సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్‌ను ఢీకొన్నపుడు వచ్చిన భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు వచ్చి క్షతగాత్రులను అనంతపురంలోని క్రాంతి హాస్పిటల్‌కు తరలించారు. ఏజేసీ భౌతిక కాయాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు.
 
 కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ విజయేందిర, డీఆర్వో హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు ఏజేసీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఖమ్మం డీఆర్వోగా పనిచేస్తున్న జయచందర్ పదోన ్నతిపై ఈ ఏడాది సెప్టెంబర్ 6న అనంతపురం అదనపు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఆరు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. స్వస్థలం గుంటూరు. భార్య, కుమారుడు, కుమార్తె హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ప్రమాదంలో గాయపడిన కుమారుడు సందీప్ అదే రోజు తన తండ్రి వద్దకు వచ్చాడు.
 
 అతివేగమా.. డ్రైవర్ నిద్ర మత్తా?
 మరో పది నిమిషాలు ప్రయాణం సవ్యంగా సాగి ఉంటే ఏజేసీ.. సురక్షితంగా గమ్యస్థానం చేరుకునే వారు. కానీ అతివేగం.. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బొలెరో వాహనం డివైడర్‌పై దాదాపు 120 అడుగుల దూరం వరకూ దూసుకెళ్లి బ్రిడ్జిని ఢీకొని ఆగిపోయింది. దీన్నిబట్టి చూస్తుంటే వాహనం దాదాపు 100 కిలోమీటర్ల పైగా వేగంతో వస్తున్నట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో కలిసి ధర్మవరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన సాయంత్రం ఐదు గంటలకు అనంతపురం చేరుకున్నారు.
 
 అదే రోజు రాత్రి వ్యక్తిగత పనిపై ప్రైవేటు వాహనం(బొలెరో)లో కర్నూలు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. ప్రైవేట్ వాహనం కావడం, ఇంకా బండికి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేకపోవడంతో అందులో ప్రయాణిస్తున్నది ఏజేసీ, ఆయన కుమారుడని స్థానికులు గుర్తు పట్టలేకపోయారు. అర్ధ గంట తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నారాయణరెడ్డి, పోలీసు సిబ్బంది వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. తదితరులు ప్రభుత్వాస్పత్రిలో ఏజేసీ భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం కాంత్రి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 నిజాయతీ అధికారిని కోల్పోయిన ‘అనంత’
 అదనపు జాయింట్ కలెక్టర్ జయచందర్‌కు నిజాయతీ అధికారిగా పేరుంది. ఇందుకు నిదర్శనం సోమవారం ప్రయణించిన వాహనమే. సొంత పనులకు ప్రభుత్వ వాహనాలు వాడకూడదనే నిబంధన ఉండడంతో అందుకు లోబడే ఆయన వ్యవహరించారు. కర్నూలుకు వెళ్లడం వ్యక్తిగత పని కావడంతో సోమవారమంతా ప్రయాణించిన ప్రభుత్వ వాహనం, వాహన డ్రైవర్, వ్యక్తిగత సహాయకులకు విరామమిచ్చి ప్రైవేట్ వాహనాన్ని తీసుకెళ్లారు. ఏజేసీ మృతితో జిల్లా అధికార యంత్రాంగం శోకసంద్రంలో మునిగిపోయింది.
 

మరిన్ని వార్తలు