ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు

12 Aug, 2019 10:25 IST|Sakshi

సాక్షి, రణస్థలం: రసాయనిక పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరువవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం భద్రత కల్పిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయే తప్ప ఆచరణలో చూపడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఉన్న వివిధ పరిశ్రమల్లో 10మంది చనిపోయారు.

రసాయనిక పరిశ్రమలో కానరాని భద్రత..
రసాయనిక పరిశ్రమలో నైపుణ్యం కల్గిన ఉద్యోగస్తులు ఉండాలి. ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే దురాలోచనతో సబ్‌ కాంట్రాక్టర్లకు పరిశ్రమ నిర్వహణ అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేనివారికి తక్కువ వేతనాలు ముట్టచెప్పి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. గత 20 ఏళ్లుగా పైడిభీమవరంలో దాదాపు 20 వరకు చిన్న పెద్ద  రసాయనిక పరిశ్రమలు ఉన్నా నేటికీ సరైన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయలేదు సరికదా, భద్రతపై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు. భద్రత పరికరాలు సమకూర్చడం లేదు.

పారిశ్రామికవాడలో కానరాని ఈఎస్‌ఐ ఆసుపత్రి..
కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఆరోగ్యం బాగోలేకపోయిన ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకువెళతారు. కానీ పైడిభీమవరంలో ఈఎస్‌ఐ ప్రాధమిక చికిత్స కేంద్రం తప్ప, కనీసం 30 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి సదుపాయం కూడా గత ప్రభుత్వాలు కల్పించలేకపోయాయని కార్మిక సంఘాలు తరుచూ గగ్గోలు పెడుతున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగిన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయగనగరం, 70 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖపట్నం తరలించాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన∙వ్యక్తం చేస్తున్నారు. తరలించేలోగానే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

కార్మికులు ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తున్నారు..
భద్రత గురించి కార్మికులు పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దీంతో కార్మికులు భయపడి ఎవరికీ చెప్పకోక ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. 
– కె.గురునాయుడు, అరబిందో సీఐటీయూ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు

భద్రత చర్యలు తీసుకోవడం లేదు.. 
ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడం లేదు. భద్రత పరికరాలు సక్రమంగా ఇవ్వటం లేదు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపాలు ఉంటే సరిచేయమని చెప్పాలి. 
– పి.తేజేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు

కార్మికుల భద్రతపై పరిశ్రమ యాజమాన్యాలు దృష్టి సారించాలి.. 
ప్రతి ఏడాది పరిశ్రమలోని భద్రత వైఫల్యాలపై నివేదిక అందిస్తాం. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు భద్రతపై గుర్తు చేస్తుంటాం. తక్షణమే పరిశ్రమ యాజమాన్యాలు సరిచేసుకోవాలి.               
 – జి.వి.వి.ఎస్‌.నారాయణ, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ 

మరిన్ని వార్తలు