ఐదు లక్షల మంది నిపుణులు అవసరం

29 Feb, 2020 04:50 IST|Sakshi

ఏడు జిల్లాల్లో ఏడాదికి లక్ష మంది చొప్పున ఐదేళ్ల అవసరం ఇది

ఐసీఆర్‌ఏ అధ్యయనంలో వెల్లడి  

అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో  స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.  ఇందుకోసం ఇప్పటికే ఇక్రా (ఐసీఆర్‌ఎ) ద్వారా ఏడు జిల్లాల్లో వచ్చే ఐదేళ్లకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు ఎంత మేర అవసరం ఉందనే విషయాన్ని అధ్యయనం చేశారు.

రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా స్థానిక పరిశ్రమలకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పరిశ్రమలకు, కంపెనీలకు నైపుణ్యం గల మానవ వనరులు లభ్యత, వ్యత్యాసంపై ఇక్రా ద్వారా ప్రభుత్వం అధ్యయనం చేయించింది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నైపుణ్యం గల మానవ వనరులు ఏడాదికి లక్ష చొప్పున అవసరమని అధ్యయనంలో వెల్లడైంది. ఏ జిల్లాలో ఏఏ రంగాల్లో నైపుణ్యం గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనంలో గుర్తించారు.

అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతోంది. తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిర్సిటీని, విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీతో పాటు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ సాంకేతిక కోర్సులను నేర్చుకున్నవారికి మరింత నైపుణ్యాన్ని వీటిద్వారా కల్పిస్తారు. స్కిల్‌ యూనివర్సిటీలో నిర్మాణ రంగం, పరిశ్రమల ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషన్, పరిశ్రమల ప్లంబింగ్, ఆటోమోటివ్, మెటల్‌ కన్‌స్ట్రక్షన్, ఐటీ–నెట్‌వర్క్‌ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు