తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ

9 Jun, 2014 02:18 IST|Sakshi
తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ
  • కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు
  •  విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘ఓరే బాబూ నీ అరి కాలిపై చక్రం ఉందిరా. దేశ దిమ్మరివవుతావు. అని చాలా చిన్న వయస్సులోనే మా తాత చెప్పారు. అలాగే ఆ నాడు ఆయన చెప్పిన ప్రకారమే దేశదిమ్మరినయ్యూ. దేశమంతా తిరిగి ప్రజలకు సేవ చేయడానికే దేశ దిమ్మరినయ్యా’ అని అన్నారు కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు. చంద్రబాబు ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నగరంలోని గేట్‌వే హోటల్‌లో దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపు వాకింగ్ చే శారు.

    ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. చేసే పని మంచిదైతే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తాను రోజూ ఇంటిలో అందుబాటులో ఉన్న డ్రైవర్‌తో, కుక్‌తో ఎవరితోనైనా కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. తనకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన తరువాత హుషారుగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాకింగ్, సైక్లింగ్ చేసే సంస్కృతి పెరగాలన్నారు.

    ఇందుకోసమే పట్టణాభివృద్ధిలో భాగంగా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీలు, మెట్రో సిటీల్లో రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర నగరాల్లో వేసే రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

    ఐజీఎంసీ స్టేడియంలో అనుకోని అతిథిగా కాషాయ రంగు టీ షర్ట్, లోయర్‌తో సాదాసీదాగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు స్టేడియంలో వార్మ్‌ప్ చేస్తున్న టెన్నిస్ ఆడే చిన్నారులు ‘గుడ్ మార్నింగ్ సార్’ అంటూ స్వాగతం పలికారు. ఇందుకు వెంకయ్యనాయడు తనైదైనశైలిలో ‘మనం భారతీయులం. గుడ్ మార్నింగ్ కాదు నమస్తే అనాలి. మమ్మీ, డాడీ కాదు అమ్మా, నాన్న అని పిలవాలి’ అని సూచించారు.
     
    టెన్నిస్ చిన్నారులతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు కుశల ప్రశ్నలువేశారు. స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వెంకయ్యనాయుడుతో కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఒక సారి స్టేడియంలో వాకింగ్ చేసేం దుకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
     
    సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి
     
    స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు విషయాన్ని ‘న్యూస్‌లైన్’ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్  ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని వివరించగా వెంకయ్యనాయుడు వెంటనే తన పీఏను పిలిచి ఢిల్లీ వెళ్లగానే సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాకింగ్ అనంతరం స్టేడియం నుంచి బందరు రోడ్డుపై నడుచుకుంటూనే తాను బస చేసిన హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు.
     

మరిన్ని వార్తలు