నిబంధనల ప్రకారమే నడుచుకుంటాం

3 Apr, 2015 04:41 IST|Sakshi

కరువు బృందం ప్రకటన
జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటన

 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఏర్పడిన కరువును పరిశీలించిన కేంద్ర బృందం నిబంధనల మేరకే నడుచుకుంటామని, ఆ పరిధుల్లోనే ఆదుకుంటామని ప్రకటించింది.కేంద్ర కరువు బృందం సభ్యులు పీఎస్‌ఎన్ చక్రవర్తి, పీజీఎస్ రావు, గోవర్ధన్‌లాల్‌లు గురువారం పొన్నలూరు, పీసీపల్లి, కనిగిరి, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో పర్యటించారు.ముందుగా పొన్నలూరు మండలంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించారు. ఆయకట్టు వివరాలు, సాగునీరు అందకపోవడానికి కారణాలను, కరవు వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పశుగ్రాసం, తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, చెరువులో నీరు లేకపోవడంతో పశువులకు పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందని, గతంలో గేదెకు పది లీటర్లు పాలు ఇచ్చేవని, పశుగ్రాశం లేక ఇప్పడు మూడు లీటర్లే ఇస్తున్నాయని చెప్పారు. కదిరి మండలం గోపాలపురం రిజర్వాయర్‌ను పరిశీలించారు.  గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక రిజర్వాయర్ నిండలేదని స్థానికులు వివరించారు. అనంతరం పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయరును పరిశీలించింది.

మోపాడు రిజర్వాయర్‌కు గత నాలుగు సంవత్సరాలుగా నీరు చేరడంలేదని దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు, పనులులేక 30 శాతానిపైగా వలసలు పోయారని బందం సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు విన్నవించారు.

గత రెండేళ్లలో వందల ఎకరాల్లో బత్తాయి, నిమ్మతోటలు నిలువునా ఎండిపోయాయని, వేల ఎకరాల మాగాణి, మెట్ట భూములు బీడుభూములుగా మారాయని వెలిగొండ నీరువస్తే తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. కరువును కళ్లారాచూశాం కరువుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర  కరువు పరిశీలన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వెలిగండ్ల మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు