సినీ ఫక్కీలో రూ.13 లక్షలు అపహరణ

24 Jul, 2014 02:49 IST|Sakshi
సినీ ఫక్కీలో రూ.13 లక్షలు అపహరణ

సాక్షి, అనంతపురం : ‘మీ డబ్బులు కింద పడిపోయాయి. చూసుకోండి’ అని ఏమార్చిన దుండగులు రూ.13 లక్షల నగదున్న బ్యాగుతో ఉడాయించారు.  వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రధాన శాఖ ఉంది. ఈ బ్యాంక్‌కు సంబంధించి నగరంలో దాదాపు 8 ఏటీఎం కేంద్రాలున్నాయి.
 
  వీటిలో డబ్బును లోడ్ చేసేందుకు అనంతపురానికి చెందిన సీఎంఎస్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాన శాఖలోని ఏటీఎం సెంటర్‌లో డబ్బులు అయిపోవడంతో లోడ్ చేసేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది బ్యాంక్‌కు వెళ్లారు. మేనేజర్ పీరయ్యతో చర్చించాక రూ.13 లక్షలున్న బ్యాగును తీసుకుని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు.
 
  సెక్యూరిటీ సిబ్బంది మిషన్‌లో నగదును లోడ్ చేస్తుండగా బయటున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు లోపలికి వెళ్లి ‘సార్ ఇక్కడ డబ్బులు పడ్డాయి. మీవేనేమో చూడండి’ అని రూ.100 నోటును చూపించాడు. అది తమది కాదని, ఇప్పుడే ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకుని వెళ్లాడని, బహుశా అతడిదే అయి ఉంటుందని బయటకు తొంగి చూస్తుండగా.. బయటే ఉన్న మరో వ్యక్తి లోపలికి చొరబడి కింద ఉన్న బ్యాగును తీసుకుని ఉడాయించాడు.
 
  గుర్తించిన సిబ్బంది ‘దొంగ..దొంగ..’ అని అరుస్తుండగానే మరో వ్యక్తి కూడా పారిపోయాడు. వీరి కేకలు ఉన్న బ్యాంక్ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ పీరయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘డబ్బుతో మాకు సంబంధం లేదు. ఏటీఎంలో డబ్బును లోడ్ చేసే కాంట్రాక్ట్‌ను సీఎంఎస్ సంస్థకు ఇచ్చాం. అంతా వారే చూసుకుంటారు’ అని అన్నారు. కాగా మంత్రి పరిటాల సునీత సమీప బంధువు సోమవారం హిందూపురంలో ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లగా ఇదే రీతిలో రూ.20 లక్షల నగదున్న బ్యాగుతో ఉడాయించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే పట్టపగలు జిల్లా కేంద్రంలో మరో దోపిడీ జరగడంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. సీఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎం మిషన్‌లో డబ్బులు లోడ్ చేయడానికి వస్తున్నారన్న విషయం బ్యాంకు సిబ్బంది, సీఎంఎస్ సిబ్బందికి మాత్రమే తెలుసు. ఇలాంటి సమయంలో ఏటీఎం కేంద్రం వద్దకు ధైర్యంగా రావడమే కాకుండా, బ్యాగులో నగదు ఉన్న విషయం ముందే తెలుసుకుని సిబ్బందిని మాటల్లో పెట్టి డబ్బు బ్యాగుతో ఉడాయించారంటే ఇది ఇంటి దొంగలా పనా.. లేక అంత రాష్ట్ర ముఠా సభ్యుల  పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు