ఆరోపణలు అభూతకల్పనలు

23 May, 2016 01:58 IST|Sakshi
ఆరోపణలు అభూతకల్పనలు

నైతిక విలువలతో ఉద్యోగం చేస్తున్నా..
ఉద్యోగంలో చేరకముందే తండ్రి ఆస్తి
సంక్రమించింది

 

విశాఖపట్నం : అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అభూతకల్పనలని ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ఎం.విజయలక్ష్మి  స్పష్టం చేశారు. పీఎంపాలెంలోని తన ఇంటిపై ఏసీబీ దాడుల సందర్భంగా పత్రికల్లో వచ్చిన కధనాల్లో వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అక్రమ ఆస్తులుగా పేర్కొన్నవన్నీ ఉద్యోగంలో చేరకముందే తండ్రి నుంచి తనకు సంక్రమించాయని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో మహిళలు, పిల్లల పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నానన్నారు. అయితే తనపై కొందరు పనిగట్టుకొని చేసిన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమని భావించే తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

 
ఉన్నత కుటుంబం

స్వతహాగానే తమది ఆస్తిపాస్తులున్న కుటుంబమని విజయలక్ష్మి పేర్కొన్నారు. 1986లో వివాహం తర్వాత తండ్రి ద్వారా తనకు సంక్రమించిన మూడో వంతు ఆస్తిని విక్రయించి 1994కు ముందే.. అంటే సర్వీసులో చేరకముందు ఇక్కడ వేరే ఆస్తులు కొన్నామన్నారు. సహజంగానే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ పెరిగిందన్నారు. అఆగే ఉద్యోగంలో చేరిన 1994 నాటికి తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి వెల్లడించానని వివరించారు. భర్త వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులతో పాటు, తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి ప్రతి ఏటా నివేదిస్తున్నానని చెప్పారు. తన జీతాన్ని పొదుపు చేస్తూ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం సమకూర్చుకుంటుంటే.. అదేదో తప్పు అన్నట్లు.. దాన్ని అక్రమ ఆస్తి అని ఆరోపించడం తన మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏళ్ల సర్వీసులో ఏనాడూ ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. తన సర్వీసు రిజిస్టరే దీనికి సాక్ష్యమన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలు మొత్తం ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పారదర్శకంగా నిర్వహించామన్నారు. తన కుమార్తె పెళ్లి మరో రెండు నెలల్లో ఉన్నందున తమ ఇంటి పైఅంతస్తును నివాసయోగ్యంగా చేయడానికి కొంత నగదు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచామన్నారు. అలాగే తన కుటుంబానికి మూడు ఖరీదైన కార్లు లేవన్నారు. తన భర్త 2010లో బ్యాంకు రుణంతో కొన్న కారు, కుమార్తె తన ఉద్యోగం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొన్న సెకండ్  హ్యాండ్ కారు మాత్రమే ఉన్నాయన్నారు. తనవి కాని ఆస్తులను తన అక్రమ ఆస్తులుగా చూపించడాన్ని ఖండిస్తున్నానన్నారు.

 

భర్త కుటుంబ ఆస్తి వివాదాలే కారణం!
ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ విజయలక్ష్మి భర్త తరఫు కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఆక్కసుతోనే కొందరు విజయలక్ష్మి కుటుంబంపై తప్పుడు ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా నేరుగా సోదాలకు దిగినట్లు సమాచారం. అందువల్లే ఉద్యోగంలో చేరడానికి ముందు ఉన్న విజయలక్ష్మి ఆస్తులను అక్రమ ఆస్తులుగా మీడియా ముందు చూపించారు. ఐసీడీఎస్‌లో చేరినప్పటి నుంచి ఈమె నిబద్ధతతోనే పని చేస్తున్నారని తోటి అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు