అన్యాయం.. ఆచార్యా!

31 Jul, 2018 13:52 IST|Sakshi
ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్న వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌ తదితరులు

ఏఎన్‌యూలో వసతి గృహాల నిర్వహణపై ఆరోపణలు

సరకుల కొనుగోళ్లు, విద్యార్థుల మెస్‌ చార్జీల్లో అవకతవకలు

అధికబిల్లులపై నిలదీస్తే తగ్గిస్తామంటున్న అధికారులు

అక్రమాలను నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనబాట

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహాల నిర్వహణ గందరగోళంగా మారింది. బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటిధరలకు సంబంధించి రికార్డుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్ల నిర్వహణను నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.

ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాలుర వసతి గృహాల వ్యవహా రాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. వసతి గృహాల నిర్వహణలో మితిమీరిన అవినీతి జరుగుతోందని విద్యార్థులు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. వసతుల కల్పన, అధిక బిల్లులు, వసతి గృహాలకు సంబంధించిన ఆహార పదార్థాల కొనుగోలు, వసతి గృహాల్లో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య, వారికి వచ్చే మెస్‌ బిల్లులు, వీటికి సంబంధించిన రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్ల నమోదు వంటి అంశాలపై స్పష్టత లేదనివిద్యార్థులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే తమకు ఇక్కడ అధికంగా వస్తున్న మెస్‌ బిల్లులు భారంగా మారాయని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర వసతి గృహాల్లో అవినీతిని నిర్మూలించాలని, అధికంగా వస్తున్న మెస్‌ బిల్లులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్‌యూ బాలుర వసతి గృహాల విద్యార్థులు సోమవారం వసతి గృహాల్లో ధర్నాకు దిగారు. ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి వసతి గృహాల కామన్‌ డైనింగ్‌ హాల్‌ ఎదుట బైఠాయించారు. కామన్‌ డైనింగ్‌ హాల్, వసతి గృహాలకు వెళ్ల ద్వారాల గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. అధి కారుల అవినీతిని నిర్మూలించాలని, మెస్‌ బిల్లులు తగ్గించాలని నినాదాలు చేశారు.న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

కొనుగోళ్లు, మెస్‌ చార్జీలపై గందరగోళం
వసతి గృహాల్లో విద్యార్థులకు వండే భోజన పదార్థాల కోసం బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటి ధరలు, నాణ్యత సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏ రోజు ఎన్ని కిలోల బియ్యం వండారు? ఎన్ని కిలోల కూరగాయలు వాడారు? ఇతర పదార్థాలు ఎన్ని వాడారు? అసలు ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారు? అన్న అంశాలపై స్పష్టత ఉండటం లేదని, సంబంధిత రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బిల్లులు వేసే సమయంలో సంబంధిత అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వసతి గృహాల్లో లెక్కలు చూపాలని అడిగిన వారిపై చీఫ్‌ వార్డెన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ బిల్లులు వేసి తగ్గిస్తారంట
వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.3600 నుంచి రూ.4 వేల వరకు ఎక్కువ వేసి వసూలు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వసతి గృహాల్లో రెండు వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారని, వారి నుంచి ఇలా అధికంగా బిల్లులు వసూలు చేయడం పరి పాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇతర యూనివర్సిటీల్లో వారానికోసారి మాంసాహారం పెట్టినా బిల్లు నెలకు రూ.1600లకు మించడంలేదని ఇక్కడ శాఖాహార భోజనం పెట్టి నెలకు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. బిల్లులు అధికంగా రావడంతో సందేహం వచ్చిన విద్యార్థులు కొనుగోళ్లు, మెస్‌ చార్జీల రికార్డులను పరిశీలించగా కొనుగోళ్ల వివరాలు, నెలసరి చార్జీల నమోదులో లోపాలు ఉన్నాయని గుర్తించారు.

ఈ లోపాలపై చీఫ్‌ వార్డెన్‌ తదితర అధికారులను నిలదీయగా బిల్లులు తగ్గిస్తామని బదులిచ్చారు. అవకతవకలను సరిచేయకుండా బిల్లులు తగ్గిస్తామనడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ పేరుతో నెలకు ప్రతి విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని, వాటిని విద్యుత్‌ దీపాలు, తదితర పరికరాల కొనుగోలుకు వాడుతున్నామంటూ హాస్టల్‌ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ బల్బులు, ఇతర పరికరాల కొనుగోలుకు యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, తమ నుంచి వసూలు చేసిన మొత్తం కొందరి జేబుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.36 లక్షల అవినీతి జరిగిందని కూడా విద్యార్థులు విమర్శిస్తున్నారు. వీటిన్నింటిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చనందునే సమస్య జటిలమవుతోందని వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు