పౌర సేవలు లోపిస్తే చర్యలు

14 Dec, 2013 04:30 IST|Sakshi

 శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో సిటిజన్ చార్టర్ ప్రకారం ప్రజలకు సకాలంలో, సక్రమంగా సేవలందించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ డాక్టర్ బి.జనార్దనరెడ్డి హెచ్చరించారు. రీజియన్‌లోని మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధుల్లో భాగమైన పౌరసేవల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం తాజా సమాచారం కంప్యూటర్లలో అప్‌లోడ్ అవుతోందో.. లేదో కూడా చూడలేని దుస్థితిలో కమిషనర్లు ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు.

 పారిశుద్ధ్య నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో పనులు కన్పించడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో బొబ్బిలి, సాలూరు మున్సిపాల్టీలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తడిచెత్త కంపోస్టింగ్  ఎందుకు చేయలేకపోతున్నారని శ్రీకాకుళం కమిషనర్ రామ్మోహనరావు, హెల్త్ ఆఫీసర్ రవికిరణ్‌లను ప్రశ్నించారు. వారినుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారం రోజులపాటు సాలూరు మున్సిపల్ కమిషనర్ సుభాన్ ఖాన్ సహకారం తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఆస్తి పన్ను వసూళ్లు, పార్కులు, మున్సిపల్ స్థలాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ల పనితీరును సమీక్షించారు.

పైలీన్ తుపాను, వరద నష్టాలకు సంబంధించిన ప్రత్యేక నిధులను వారంలోగా అందిస్తామని తెలిపారు. ఈ నిధులను సంబంధిత పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు సక్రమంగా జరగాలన్నారు. కొత్తగా మున్సిపాల్టీలుగా మారిన పాలకొండ, నెల్లిమర్లల్లో సిబ్బందికి జీతాలు రావడం లేదని కమిషనర్లు డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్డీ ఆశాజ్యోతి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శరత్‌బాబు, మున్సిపల్ కమిషనర్లు రామ్మోహనరావు, గోవిందస్వామి, విజయనగరం మెప్మా పీడీ వెంకటరమణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు