24 గంటల్లోనే చార్జిషీట్‌ దాఖలు

13 Feb, 2020 03:18 IST|Sakshi

దిశ యాప్‌ ద్వారా నమోదైన తొలి కేసులో చురుగ్గా దర్యాప్తు  

బస్సులో ప్రభుత్వ మహిళా అధికారిని వేధించిన ఏయూ ప్రొఫెసర్‌ 

యాప్‌ ద్వారా రక్షణ కోరిన బాధితురాలికి పోలీసుల అండ

ఏలూరు టౌన్‌/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారు. దిశ పోలీసు స్టేషన్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ఈ యాప్‌ ద్వారా రక్షణ కోరిన ప్రభుత్వ మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచారు. ఆమెను వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్‌ బసవయ్య కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పోలీసులు చార్జిషీట్‌ను(అభియోగ పత్రం) కేవలం 24 గంటల్లోనే బుధవారం ఎక్సైజ్‌ కోర్టులో దాఖలు చేయడం గమనార్హం. 

అసలేం జరిగింది.. 
విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా అధికారిని ఆంధ్రా యూనివర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్‌ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కాలోతు బసవయ్య మంగళవారం తెల్లవారుజామున పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. వెంటనే ఆమె దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ ద్వారా రక్షణ కోరగానే, బస్సు ఏలూరు జాతీయ రహదారిలో పెదపాడు మండలం పరిధిలోని కలపర్రు టోల్‌గేట్‌ వద్దకు చేరుకునేలోపు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు స్పందించి, కేవలం 6 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితురాలికి రక్షణగా నిలిచారు. నిందితుడిని అరెస్టు చేసి ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును పెదపాడు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పెదపాడు ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులో చార్జిషీటును ఏలూరు ఎక్సైజ్‌ కోర్టులో దాఖలు చేశారు. 

దేహశుద్ధి జరిగినా బుద్ధి మార్చుకోని బసవయ్య 
దిశ యాప్‌ ద్వారా నమోదైన తొలి కేసులోని నిందితుడు కాలోతు బసవయ్య నాయక్‌ నేపథ్యం ఆరా తీస్తే అతడు గతంలోనూ మహిళలను వేధించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బసవయ్య ఎమ్మెస్సీ చదివి, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాడు. ఇటీవలే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. మహిళలను వేధింపులకు గురిచేయడం బసవయ్యకు అలవాటేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. భీమవరంలోని ఓ కాలేజీలో గతేడాది జరిగిన పరీక్షలకు బసవయ్య ఎగ్జామినర్‌గా వచ్చాడు. అప్పుడు అక్కడి విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆ కాలేజీ సిబ్బంది అతడిని నిర్బంధించి, దేహశుద్ధి చేశారు. అçప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌కు సమాచారం అందించారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని యూనివర్సిటీ ప్రతినిధులు భీమవరంలోని ప్రైవేట్‌ కాలేజీ సిబ్బందికి నచ్చజెప్పడంతో అతడిని విడిచిపెట్టారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని బసవయ్య బస్సులో ప్రభుత్వ ఉద్యోగిని వేధిçస్తూ పోలీసులకు చిక్కాడు. పెదపాడు పోలీసులు అతడిపై క్రైమ్‌ నెంబర్‌ 52/2020 ఐపీసీ సెక్షన్‌ 354, 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఏలూరు ఎక్సైజ్‌ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు నిందితుడు బసవయ్యకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు