సీఎం సభల్లో అపశ్రుతి

28 Mar, 2019 09:47 IST|Sakshi
సప్తగిరి సర్కిల్‌లో కూలిన మసీదు గోడ , ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మడకశిరలో నిర్వహించిన సీఎం సభకు కార్యకర్తలను తీసుకువస్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో క్రిష్టప్ప(50)అనే టీడీపీ కార్యకర్త మృత్యువాత పడగా...మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో రాత్రి బహిరంగ సభ నిర్వహించగా... అత్యంత ఇరుకైన రోడ్లు కావడంతో ప్రజలు నిలబడేందుకు వీలుకాక పక్కనే ఉన్న కాంప్లెక్స్‌లు ఎక్కారు. మసీదు కాంప్లెక్స్‌ పురాతనమైనది కావడం... పరిమితికి మించి బాల్కానిపై నిలబడి చూస్తున్నారు. బరువును తట్టుకోలేక 15 అడుగుల బాల్కాని గోడ విరిగిపడింది. ఈ ఘటనలో బాల్కానిపై నిలుచున్నవారితో పాటు కిందనున్న వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల వైఫల్యమే కారణం 
సీఎం సభకు జనం భారీగా హాజరయ్యారని చూపించుకునేందుకు టీడీపీ నేతలు రద్దీ ప్రాంతాన్ని సభాస్థలిగా ఎంచుకున్నారు. ఇప్పటివరకూ ఎవరూ సప్తగిరి సర్కిల్‌లో బహిరంగసభలు నిర్వహించిన దాఖల్లాలేవు. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సప్తగిరి సర్కిల్‌లో బహిరంగసభల నిర్వహించేందుకు ఏ విధంగా అనుమతి ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం టీడీపీ నేతల మొప్పు పొందేందుకు, వారి అభ్యర్థతను తిరస్కరించలేక అనుమతులు ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పురాతనమైన మసీదుకాంప్లెక్స్‌పైకి ప్రజలు ఎక్కుతున్నా పోలీసులు నిలువరించలేకపోయారు. అందువల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు