వేటు పడింది..

15 Aug, 2014 04:45 IST|Sakshi

- కావలి చైర్‌పర్సన్, మూడో వార్డు కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లుపైనా..
- వైఎస్సార్‌సీపీ విప్ ఉల్లంఘించడంతో చర్యలు
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్డీఓ
కావలి: మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి టీడీపీ తరపున చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పి.అలేఖ్య, మూడో వార్డు కౌన్సిలర్ తోట వెంకటేశ్వరావుపై అనర్హత వేటు వేసినట్లు కావలి ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి కె.వెంకటరమణారెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తన చాంబర్లో ఆయన అనర్హత వేటుకు సంబంధించిన ఉత్తర్వులను వెల్లడించారు.  వైఎస్సార్‌సీపీ తరపున 13వ వార్డు నుంచి పి.అలేఖ్య, 3వ వార్డు నుంచి తోట వెంకటేశ్వరావు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారన్నారు.

గత నెల 3న జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా వారిద్దరికి నోటీసులు జారీ చేశామన్నారు. సంజాయిషీకి తొలుత 15 రోజులు, మళ్లీ మరో 15 రోజులు పొడగించామన్నారు. విప్ ఉల్లంఘనపై ఇంకా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారన్నారు.

హైకోర్టు గత నెల 8న వారం రోజుల్లోపు అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని అదేశించిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులు, ఎన్నికల కమిషన్ నిబంధనలనుసరించి వారిద్దరిపై అనర్హత వేటు వేసినట్లు చెప్పారు. నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ అలేఖ్యపై అనర్హత వేటు పడటంతో ఇన్‌చార్జి చైర్మన్‌గా వైస్ చైర్మన్ భరత్‌కుమార్ వ్యవహరిస్తారన్నారు. అనర్హత వేటు  ఉత్తర్వుల కాపీని వైఎస్సార్‌సీపీ నేతలకు ఆర్డీఓ అందజేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega