‘చంటి’ ప్రసన్నగానే గుర్తింపు

10 Aug, 2019 11:44 IST|Sakshi

లఘు చిత్రాలతో  9 నంది అవార్డులు

సామాజిక చిత్రాలంటే ప్రత్యేక ఆసక్తి

అలా చేసిన చిత్రమే ‘మరో అడుగు .. మార్పు కోసం’

విలక్షణ నటుడు ప్రసన్నకుమార్‌

సినీ నటుడు ప్రసన్నకుమార్‌ అంటే ఒక్క క్షణం ఆలోచిస్తారేమోగానీ చంటి ప్రసన్న అంటే ఠక్కున గుర్తు పడతారు. విలక్షణ నటన, డైలాగ్‌ డెలివరీలో ప్రత్యేకత ఆయన సొంతం. ఈయన మన విశాఖవాసే. గాజువాకకు చెందిన ప్రసన్నకుమార్‌ నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు సామాజిక అంశాలపై చిత్రాలు తీయడం అంటే ఆసక్తి. అలా లఘు చిత్రాలను తీసి తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. అందులో ఎక్కువ చిత్రాలు ఆయన స్వీయ దర్శకత్వంలోనివే కావడం విశేషం. ఆ ఒరవడిలో తీసిన చిత్రమే ‘మరో అడుగు మార్పు కోసం’. కులాలు, రిజర్వేషన్ల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ చిత్రానికి  రెండు అవార్డులు రాగా.. వాటిలో నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ ఫిల్మ్‌గా దాసరి ఎక్స్‌లెన్స్‌ అవార్డును నేడు నగరంలోని వుడా చిల్డ్రన్‌ ఎరీనాలో అందుకుంటున్న సందర్భంగా ప్రసన్నకుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. 

బాల్యం.. చదువు
మాది గాజువాక. టెన్త్‌ వరకు పోర్టు స్కూల్లో, ఇంటర్‌ విజయనగరం ఎంఆర్‌ కాలేజీలో చదివాను. ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాను. సినిమాలంటే ఆసక్తితో 1987లో రాష్ట్ర పారిశ్రామిక సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ వెళ్లాను.

డ్యాన్సులంటే ఇష్టం
నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సులంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ గారి డ్యాన్సులను అనుసరించేవాడిని. పోర్టు స్కూల్లో చదువుతున్నప్పుడు గురువు కృష్ణారావు ప్రోత్సాహంతో తొలిసారిగా ‘పరీక్షలు లేవు’ నాటకంలో పాత్రను వేశాను. 

7వ తరగతిలోనే నాటక రచన
చిన్న చిన్న నాటకాల్లో వేస్తున్న నేను 7వ తరగతిలో సొంతంగా ‘మోడ్రన్‌ యముడు’ నాటకాన్ని రచించి స్కూల్లో నటించా. అదే మూలకథగా యమలీల చిత్రం తీయడం ఆనందంగా ఉంది. స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌తో కలసి అత్తి కృష్ణారావు వద్ద నాటకాలు వేశాం. అనేక నాటకాలను ప్రదర్శించాం కూడా.

ముద్దమందారం మొదటి చిత్రం 
ముద్ద మందారం సినిమా షుటింగ్‌ జరుగుతున్నప్పుడు చూడటానికి వెళ్లాను. అక్కడే నాకు తొలి అవకాశం వచ్చింది. ముందు నుంచి డ్యాన్స్‌పై ఆసక్తి ఉండటంతో సినిమాలోని పాట చిత్రీకరణ చూసినప్పుడు నా డ్యాన్స్‌ను గమనించి డ్యాన్స్‌ మాస్టర్‌ శివ సుబ్రహ్మణ్యంరాజు ఆ చిత్రంలోనే మరో పాటలో నాకు అవకాశం కల్పించారు.  

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా
అభిలాష చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతున్నపుడు చిరంజీవిని చూడటానికి వెళ్లాను. ఆయన్ను కలిసి మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా ఆ సినిమాలోనే నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో డాక్టర్‌ పాత్ర చేస్తున్న వ్యక్తి అప్పుటికే చాలా టేక్‌లు తీసుకున్నా సీన్‌ రావట్లేదు. దీంతో చిరంజీవి ఆ పాత్ర చేయమని చెప్పారు. అభిమాన హీరో చిత్రంలో నటించడం అద్భుత అవకాశం అనుకున్నా. ఒక్క టేక్‌లోనే షాట్‌ ఓకే అవడంతో అందరూ ప్రశంసించారు. తర్వాత చిరంజీవితో చాలెంజ్, యముడికి మొగుడు, జేబుదొంగ, గ్యాంగ్‌లీడర్, ఇంద్ర తదితర సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాను. తర్వాత  అగ్ర నటులైన కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో నటించాను. దాదాపు అన్నీ హిట్‌ చిత్రాలే.

చంటి అవకాశం ఒక అద్భుతం..
చంటి సినిమా తమిళంలో చేసిన వ్యక్తి డేట్స్‌ దొరకకపోవటంతో నిర్మాత కేఎస్‌ రామారావుగారు నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం నా కెరీర్‌లో మైలురాయి. ఇప్పటికీ చంటి ప్రసన్నగానే గుర్తు పడుతున్నారు. 

పోలీసు పాత్రలంటే చాలా ఇష్టం 
మా నాన్నగారు పోలీస్‌. దీంతో నాకు చిన్నప్పటి నుంచి పోలీసు పాత్రలంటే చాలా ఇష్టం. నేను చేసిన 300 చిత్రాల్లో కూడా చాలా వరకు పోలీసు పాత్రలే. 
వరుణ్‌ తేజ్‌ చిత్రంలో చేస్తున్నా.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. 

సామాజిక అంశాలపై చిత్రాలు
సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు తీయడం అంటే ఆసక్తి.  2004నుంచి హైదరాబాద్‌లో ఉండటం తగ్గించి ఆ తరహా చిత్రాలను నేనే తీస్తున్నాను. ఆ ఒరవడిలో తీసిందే ‘మరో అడుగు మార్పు కోసం’. ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, ఉద్యోగావకాశాలు కల్పిస్తే రిజర్వేషన్లతో పని లేదనేది ఈ చిత్రం ఇతివృత్తం. 

ఒకే టేక్‌లో 15 నిమిషాల డైలాగ్‌
‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రంలో అసెంబ్లీ సన్నివేశంలో 15 నిమిషాల పాటు సాగే ఒక డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పాను. కుల వివక్ష, రిజర్వేషన్లు, విద్యావ్యవస్థ, ప్రేమికుల ఆత్మహత్య, అవినీతి, అక్రమాలపై సాగే ఈ డైలాగ్‌ అందరినీ ఆలోచింపజేసింది. దీనిపై నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. 

9 నంది అవార్డులు
లఘు చిత్రాలైన వేట, పెద్దలను దిద్దిన పిల్లలు, చేయూతనివ్వండి చిత్రాలకు రెండేసి నంది అవార్డులు, చేయి చేయి కలుపుదాం సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి మూడు నంది అవార్డులు వచ్చాయి. తాజాగా ‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం, భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్తంగా భారత్‌ కళారత్న అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ ఫిల్మ్‌గా దాసరి ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రకటించారు.

‘మరో అడుగు మార్పు కోసం’ ఉచిత ప్రదర్శన నేడు
‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రం రెండు అవార్డులను పొందిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వుడా చిల్డ్రన్‌ ఎరీనాలో చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అవార్డుల విజయోత్సవం నిర్వహించానున్నారు. ఈ ప్రదర్శనకు పిల్లలను తీసుకువచ్చి వారిలో దేశ భక్తిని నింపాలని ప్రసన్న కుమార్‌ కోరారు.

మరిన్ని వార్తలు