అమ్మ, నాన్నలకు ఇష్టం లేకపోయినా ...

14 Jun, 2015 10:02 IST|Sakshi
అమ్మ, నాన్నలకు ఇష్టం లేకపోయినా ...

విజయవాడ: తెలుగు సినీ పరిశ్రమలో నటులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోదని ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు అన్నారు. చిన్న సినిమాలను నమ్ముకున్న ఆర్టిస్టులకు కష్టాలే ఎదురవుతున్నాయని చెప్పారు.  పరభాషా నటులపై వ్యామోహం, డబ్బింగ్ సినిమాల ప్రభావంతో తెలుగు సినీ పరిశ్రమ కుదేలవుతోందన్నారు. స్థానిక పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్ కార్యాలయానికి శనివారం విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
 
 ప్రశ్న: మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
 జవాబు : నాలుగో తరగతి నుంచే రాజమండ్రిలో నాటకాలు వేసేవాళ్లం. చిన్నతనం నుంచే రంగస్థలంపై పలు ప్రదర్శనలు ఇవ్వడంతో సినిమాలపై ఆసక్తి కలిగింది. అమ్మ, నాన్నలకు ఇష్టం లేకపోయినా డిగ్రీ పూరైన తర్వాత హైదరాబాదు వచ్చి ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగం చేస్తూ పరిశ్రమలో అవకాశాల కోసం వేట ప్రారంభించా. 1985లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన వసంతగీతం సినిమాతో తొలి అవకాశం వచ్చింది.
 
ప్ర : ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చిన పాత్ర ఏది?
 జ : కూలీ నెం.1 సినిమా చేస్తున్న సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  గమనించి, ఆ తర్వాత మెగాస్టార్  చిరంజివి నటించిన ఘరానా మెగుడు చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. దానితో మంచి గుర్తింపు వచ్చింది.
 
ప్ర : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
జ : 25 ఏళ్ల సినీ జీవితంలో హస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించా. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మేస్త్రీలో చేసిన పాత్ర, ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం జైశ్రీరామ్‌లో విలన్‌గా నటించడం తృప్తిని ఇచ్చాయి.
 
ప్ర : ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో చిన్న నటీనటులకు అవకాశాలు ఎలా ఉన్నాయి?

జ : చిన్న సినిమాలు బాగా తగ్గిపోవడంతో వీటిపై ఆధారపడిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు దారుణంగా మారుతున్నాయి. మన దర్శక, నిర్మాతలు పరభాష నటులపై ఆసక్తి చూపడం కూడా తెలుగు నటుల అవకాశాలను దెబ్బతీస్తోంది.


ప్ర : డబ్బింగ్ చిత్రాల ప్రభావం ఎంతవరకు ఉంది?
జ : తెలుగు నటీ, నటులకు అవకాశాలు తగ్గిపోవడానికి డబ్బింగ్ చిత్రాలు కూడా కారణమే. డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమకు ముప్పు పొంచి ఉంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలను ఇప్పటికే నిషేధించారు. ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేయకపోతే పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకమే.
 
 ప్ర : ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?
జ : రామ్‌చరణ్- శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ - హరీష్‌శంకర్, బాలకృష్ణ- శ్రీవాస్ కాంబినేషన్లలో రూపొందుతున్న చిత్రాలతో పాటు, శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న మరో రెండు చిత్రాల్లోను మంచి పాత్రలను పోషిస్తున్నా.
 
 ప్ర : మీ అబ్బాయి కృష్ణంరాజు సినిమాలు ఏవి?
జ : మా అబ్బాయి కృష్ణంరాజు హీరోగా ప్రస్తుతం ‘లక్ష్మీదేవి సమర్పించు- నేడే చూడండి’, ‘నాకైతే నచ్చింది’ చిత్రాల్లో నటిస్తున్నాడు. కృష్ణుడుతో కలిసి మరో హర్రర్ మూవీ కూడా చేస్తున్నాడు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా