రానున్న కాలం యువతదే

18 Oct, 2018 04:09 IST|Sakshi

లోకానికి ప్రేమను పంచిన కరుణామయుడైనా.. సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అంటూ విశ్వసౌభ్రాతృత్వాన్ని చాటిన షిరిడిసాయినాథుడైనా.. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన టంగటూరి ప్రకాశం పంతులైనా..భక్త కబీరైనా, యోగి వేమనైనా ఇలా ఉంటారా అనే విధంగా ఆయా పాత్రలతో తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసిన సినీ నటుడు విజయ్‌చందర్‌. షిరిడిసాయిబాబా 100వ పుణ్యతిథి సందర్భంగా అనంతపురంలో జరుగనున్న భారీ నగరోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలపైనే కాకుండా వర్తమాన రాజకీయాలపైన విస్తృత అవగాహనతో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.          

సాక్షి: మీ కుటుంబ నేపథ్యం చెప్పండి.. 
విజయ్‌చందర్‌: మాది తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో మా పూర్వీకులు కరణాలుగా ఉండేవారు. ముఖ్యంగా 1935 ప్రాంతంలో  కాకినాడ జమిందారు జానకి రామయ్యగారు మా తాతగారిని దత్తత తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండిపోయాము. తర్వాత మా చదువంతా కాకినాడలోనే నడిచింది. నాకిప్పుడు 80 ఏళ్లు. గాంధీజీ పర్యటనలు, భారత స్వాతంత్య్ర పోరాటం దగ్గరగా చూసే అవకాశం నాకు  కల్గడం అదృష్టం. ప్రఖ్యాత గాయని టంగటూరి సూర్యకుమారి స్వయానా మా పిన్నిగారవుతారు. 

సాక్షి: సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? 
విజయ్‌చందర్‌: మేము చదువుకునే రోజుల్లో రాఘవ కళా సమితి అనే నాటక సమాజాన్ని స్థాపించుకుని నాటకాలాడేవాళ్లం. ఏడిద నాగేశ్వరరావు, కె.విశ్వనాథ్, వీబీ రాజేంద్రప్రసాద్‌ లాంటి దిగ్గజాలు మా సంస్థలో ఉండేవారు. అలా నేను నాటకాలలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా స్త్రీపాత్రతో ప్రవేశించాను. వరుసగా 6, 7 సినిమాలు హీరోగానే నటించాను.  

సాక్షి: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎలా మారారు ? 
విజయ్‌చందర్‌: క్యారెక్టర్‌ బలంగా ఉండే పాత్రలు రావడం నా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే 1978లో ‘కరుణామయుడు’ సినిమాలో క్రీస్తు పాత్ర ధరించాను. అంతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ క్రీస్తు ఇలానే ఉంటారన్న భావనలో ఉండిపోయారు. ఇతర భాషల్లో చాలా అవకాశాలొచ్చినా నాకు తెలుగంటే మహా పిచ్చి. దానికి తోడు మంచి పాత్రలు రావడంతో ఇక్కడే ఉండిపోయాను.  

సాక్షి: బయోపిక్స్‌ తీయడం ఇష్టమనుకుంటా..! 
విజయ్‌చందర్‌: ఇప్పుడిప్పుడు బయోపిక్స్‌కు చాలా ఆదరణ వస్తోంది. కానీ బయోపిక్స్‌ ప్రారంభమైందే నాతో అని చాలామంది అంటారు. నిజమే క్రీస్తు పాత్ర నుండి షిరిడి సాయిబాబా, భక్త కబీరు, యోగి వేమన, టంగటూరి ప్రకాశం పంతులు లాంటి జీవితాలకు అద్దం పట్టేట్టు నటించడం నాకొచ్చిన మంచి అవకాశం. ఇటీవల సావిత్రిపై వచ్చిన సినిమా కూడా చాలా బాగుంది.  

సాక్షి: సినిమాలపై మీ అభిప్రాయం 
విజయ్‌చందర్‌: చాలామంది సినిమాలు చెడిపోతున్నాయనే భావనతో నేను అంగీకరించను. నటీనటుల్లో కూడా అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్‌ ఎంత క్రమశిక్షణతో ఉండే వారో ఎంత మంచి నటులో ఇప్పటితరంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, అల్లూ అర్జున్, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌ లాంటి వారు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. అంతే స్టార్‌డమ్‌ ఉంది. మంచి చెడులు అప్పుడూ ఉన్నాయి ఇప్పుడూ ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమా ఇప్పుడు కాక మరెప్పడిది. 

సాక్షి: రాజకీయ అరంగేట్రం గురించి.. 
విజయ్‌చందర్‌: కొత్తగా రాజకీయాల్లోకి రావడం ఏమిటండి? రాజకీయాలు పుట్టిందే మా తాతగారైన ప్రకాశం పంతులు ఇంట్లో. భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేని రోజుల్లో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ 11 నెలల పాటు తాతయ్య సీఎంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం కూడా ముఖ్యమంత్రి అయ్యారు. విలువల కోసం పదవిని త్యజించిన త్యాగం ఆయనది. అప్పటి నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానే రాజకీయాలలో ఉన్నాను. 

సాక్షి: రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం.. 
విజయ్‌చందర్‌: అదొక మధురానుభూతిగా మిగిలిపోయింది. చిన్నవయసులో చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రులుగా ఉన్న సమయంలో ఒకసారి సినిమాల విషయమై వారితో కలిశాను. ప్రత్యేకంగా రాజశేఖరరెడ్డి నవ్వు నన్ను అమితంగా ఆకర్షించింది. అలా పరిచయం అయిన తర్వాత వందలసార్లు ఆయన ఇంటికి వెళ్లే సందర్భాలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగారు ‘తరచూ మా ఇంటికి వస్తున్నారు ఏమైనా చేయాలా’ అని. ‘వద్దు కేవలం మీ స్వచ్ఛమైన నవ్వును చూడడానికి మాత్రమే వస్తున్నాను’ అని నేను అనేవాన్ని. 

సాక్షి: రాజకీయాలు, సినిమాల ప్రయాణం ఏకకాలంలో సాధ్యమేనా? 
విజయ్‌చందర్‌: నా వయసుకు తగ్గట్టు నేను లేను. అంటే వృద్ధాప్య మనస్తతం నాది కాదు. పొట్టి శ్రీరాములు బయోపిక్‌ తీయాలని కొందరు పట్టుబట్టారు. మేమదే పనిలో ఉన్నాము. ఇక రాజకీయాలంటారా కాంగ్రెస్‌ ఏపీ ప్రజలకు చేసిన మోసానికి నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే యువశక్తిని అందరూ గుర్తిస్తారు. రానున్న రోజుల్లో జరిగేది అదే. ఇక నా విషయమంటారా ధర్మాన్ని కాపాడడానికి నా వంతు కృషి చేయడమే మినహా ఇక నేను కోరుకునేదేదీ ఉండదు. 

సాక్షి: రాజకీయ విలువలు నాడు.. నేడు ఎలా ఉన్నాయి? 
విజయ్‌చందర్‌: అందరినీ అనలేం కానీ పూర్తి స్వార్థపరంగా మారిపోయాయి పరిస్థితులు. దేశ మాత సంకెళ్లను తెంచడానికి నాటి నాయకులు పోరాటం చేస్తే.. ఇప్పటి పరిస్థితులు చూస్తే మళ్లీ బానిస బతుకుల్లోకి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తోంది. మరో స్వాతంత్య్ర ఉద్యమం తప్పదనే స్థితికి చేరుకోవడం విచారకరం. ఆ రోజుల్లో మా తాతగారు నీలం సంజీవరెడ్డినైనా, బెజవాడగోపాలరెడ్డినైనా ప్రేమతో ఏరా అని సంబోధించినా మనస్పూర్తిగా అంగీకరించేవారు. ఇప్పుడెక్కడున్నాయి విలువలు. 

సాక్షి: వ్యక్తిత్వంలో వైఎస్సార్‌కు ఇతరులకు ఉన్న తేడా? 
విజయ్‌చందర్‌: కొంత కాదు కొండంత. చాలామంది కరుడు కట్టిన స్వార్థంతో ఉంటే రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రజల పిచ్చిలో ఉండేవారు. ఏమైనా చెప్పారు అంటే అది కచ్చితంగా చేస్తారనేది నూరు శాతం గ్యారంటీ అని ప్రజలు గట్టిగా నమ్మారు. అదే చంద్రబాబును చూడండి చెప్పింది చేస్తే ఏమవుతానో అనే భయంతో చేయకుండా ఉంటారు. 

సాక్షి: సమీప రాజకీయాలెలా ఉండబోతున్నాయి? 
విజయ్‌చందర్‌: యువతదే రానున్న రాజ్యం. దేశమంతటా యువ శక్తి అధికారాన్ని కైవసం చేసుకుని దేశాన్ని నడిపిస్తుంది. అదే కోవలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి తప్పకుండా రాష్ట్రాధినేత అవుతారు. చాలామంది నమ్మరు. నేను క్రీస్తుతో, బాబాతో మాట్లాడే అను భూతి పొందుతుంటాను. వారు చెప్పినట్టే నా జీవితం నడుస్తోంది. జగన్‌ బాబు గురించి కూడా వారి అభిప్రా యం అదే. కుళ్లు, కుట్రలు ఛేదించుకుని ప్రజల్లో ఉన్న నాయకున్ని వెనక్కు నెట్టేయడం ఎవరి తరం కాదు. 

మరిన్ని వార్తలు