విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు

13 Oct, 2014 01:56 IST|Sakshi
విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు

‘సాక్షి’తో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్

సాక్షి, హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా చాలా వరకూ నిలిచిపోయిందన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్పారు. గంటకు 160 కిలో మీటర్ల వేగమైన గాలిని తట్టుకునే స్థాయిలోనే పోల్స్ ఉన్నాయని, ప్రస్తుతం అక్కడ 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో నష్టం భారీగా ఉందని వెల్లడించారు.

ట్రాన్స్, జెన్‌కో సీఎండీ విజయానంద్ నేతృత్వంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తమ బృందాలు కొన్ని ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని, మరికొన్ని రాజమండ్రి సమీపంలో ఉన్నాయని, సోమవారం నాటికి విశాఖకు చేరుకుంటాయని చెప్పారు. ముందుగా విశాఖపట్నంలో విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని, ఆ తర్వాత జిల్లాల్లో చర్యలు చేపడతామని తెలిపారు. కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి కూడా తీవ్ర అంతరాయం ఉందన్నారు.

డిమాండ్ తగ్గడం వల్ల ఇది పెద్ద ఇబ్బంది కావడం లేదన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, ఇన్సులేటర్స్, కండక్టర్ వైర్స్, పవర్ కేబుల్స్ సిద్ధం చేసినట్టు వివరించారు. జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉత్తరాంధ్రలో అనేక చోట్ల రోగులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు జిల్లాల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు