అన్ని పథకాలకు ఆధార్

20 May, 2016 03:39 IST|Sakshi
అన్ని పథకాలకు ఆధార్

నెలాఖరులోగా మీసేవలో మరో వంద సేవలు: సీఎం

 సాక్షి, విజయవాడ బ్యూరో: అన్ని పథకాల సేవలకు ఆధార్ నూరుశాతం అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ సీఎంవోలో గురువారం ఐటీ శాఖతో పాటు 10 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీసేవ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 329 సేవలకుతోడు అదనంగా మరో వంద సేవలను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాషమంతటా నగదు రహిత పథకం అమలులోకి రావాల్సి ఉందని, ఇందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

ఎరువుల పంపిణీ నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ వరకు రైతులకు బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా అవకతవకలకు తావుండదన్నారు. శాటిలైట్ దృశ్యాలద్వారా పంట నష్టాన్ని తెలుసుకునేందుకు సర్వే నంబర్ ఆధారంగా పంట వివరాలను నమోదు చేయాలన్నారు.  రాష్ట్రానికి అవసరమైన అన్ని బయోమెట్రిక్ మిషన్ల కోసం ఒకేసారి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖ, విభాగం కోర్ డాష్‌బోర్డులో త్రీస్టార్ రేటింగ్స్ సాధించాలని సూచించారు. ప్రతి గ్రామంలోను ఒక డ్వాక్రా సంఘాన్ని బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గోదావరి తరహాలోనే కృష్ణమ్మకు హారతి..   
గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణమ్మకు నిత్యహారతి ఇవ్వాలని, లేజర్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పది శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారు.

 అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన పేద, మధ్యతరగతి వర్గాలకు సత్వరం న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ కేసు పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

 ‘రోను’పై అప్రమత్తంగా ఉండాలి
నవ్యాంధ్రప్రదేశ్‌కు సంక్షోభాలు వారసత్వంగా సంక్రమించాయని, వాటిని అవకాశంగా మలుచుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు. రోను తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, తీర ప్రాంత కలెక్టర్లు, పలు శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు నేల మెత్తబడుతుంది కాబట్టి పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం ముమ్మరం చేయాలన్నారు. వర్షాలు, ఈదురుగాలులకు జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి భోజనం, తాగునీరు అందించాలని ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని సహాయక చర్యలు చేపట్టేలా అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం కావాలని ఆదేశించారు. నవ్యాంధ్రకు సంక్షోభాలు సంక్రమించాయని, అయితే గత ఏడాది వచ్చిన హుద్‌హుద్ తుపాను సంక్షోభాన్ని అధిగమించామన్నారు.

కేంద్రంతో చాలా పనులున్నాయ్: బాబు
కేంద్రంతో చాలా పనులున్నాయని, చేయించుకోవాల్సినవి చాలా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు ఆదుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలసిన సందర్భంగా కోరినట్లు చెప్పారు. గురువారం రాత్రి విజయవాడలోని నాక్ కల్యాణ మండపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకే కాకుండా.. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరానన్నారు. అంతకుముందు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్‌లు సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు