సీమాంధ్రకు అదనంగా బలగాలు

27 Jul, 2013 04:15 IST|Sakshi
సీమాంధ్రకు అదనంగా బలగాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతోందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడడం పై దృష్టి సారించారు. 14 కంపెనీల అదనపు సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు 2 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) కంపెనీలను కూడా శుక్రవారం సీమాంధ్రకు తరలించారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 కంపెనీల కేంద్ర బలగాలుండగా, పక్క రాష్ట్రాల నుంచి మరో 15 కంపెనీలు కూడా రానున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ఇప్పటికే 15 కంపెనీల కేంద్ర బలగాలుండటం తెలిసిందే. వాటిని రంజాన్, బోనాల దృష్ట్యా ముందస్తు చర్యగా మాత్రమే సిద్ధంగా ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన డీజీపీ దినేశ్‌రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కేంద్ర హోం మంత్రి షిండే, ఉన్నతాధికారులతో చర్చించారు.

శుక్రవారం హైదరాబాద్ రాగానే ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కలిశారు. ఢిల్లీ పరిణామాలతో పాటు హోం శాఖ సూచనలను కూడా ఆయనకు వివరించినట్టు సమాచారం. సీమా్రంధ్రలో సమైక్య ఆందోళనలు, నిరసనలు పెరిగే ఆస్కారం, తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తున్న కొందరు సీమాంధ్ర నేతలపైనా సమైక్యవాదులు ఆగ్రహంతో ఉన్నారనే సమాచారం నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శనివారం పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్, ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రలో ఆందోళనలు మిన్నుముట్టవచ్చని నిఘా విభాగం కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తొలి విడత పోలింగ్ కోసం సీమాంధ్రలో మోహరించిన బలగాలను అక్కడే కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు, హాస్టళ్ల వద్ద ముందస్తు జాగ్రత్తలో భాగంగా బలగాలను సిద్ధంగా ఉంచారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణను సమర్థిస్తున్న పలువురు నేతలకు భద్రత పెంచాల్సిందిగా కూడా డీజీపీ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి.


బలగాల తరలింపు ఇలా...
న్యూస్‌లైన్ నెట్‌వర్‌‌క : రాష్ట్రంలోని పలు జిల్లాలకు కేంద్రం నుంచి గురు, శుక్రవారాల్లో అదనపు భద్రతా దళాలు వచ్చాయి. చిత్తూరు జిల్లాకు 18 బ్యాచ్‌ల ఎస్టీఎఫ్ దళాలు(ఒక్కో బ్యాచ్‌కి 20 మంది సిబ్బంది), 12 స్ట్రైకింగ్ పార్టీల (ఒక్కో పార్టీలో 20 మంది ఉంటారు) బలగాలు వచ్చాయి. మొత్తం 600 మంది భద్రతా సిబ్బంది జిల్లాకు చేరారు. కర్నూలు జిల్లాలో ఐదు ప్లాటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, ఒక కంపెనీ సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అనంతపురం జిల్లాకు ఓ కంపెనీ సీఆర్‌పీఎఫ్ బలగాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ బలగాలను నడిపించడానికి ప్రత్యేకంగా ఓ ఏఎస్పీని నియమించింది. కర్ణాటక నుంచి ఆర్మ్‌డ్ రిజర్వు ఫోర్స్‌కు చెందిన 90 మంది సిబ్బంది కృష్ణా జిల్లాకు వచ్చారు. గుంటూరు జిల్లాకు కేంద్రం నుంచి రెండు కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయి. వీరిలో 600 మందిని గురజాల, సత్తెనపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఎన్నికల విధులకు కేటాయించారు. మరో రెండు కంపెనీలకు చెందిన 600 మంది జిల్లాకు రానున్నట్లు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. విశాఖ జిల్లాకు శుక్రవారం రెండు ప్లాటూన్ల సాయుధ బలగాలు చేరుకున్నాయి. వైఎస్సార్ జిల్లాకు శుక్రవారం రెండు కంపెనీల అదనపు బలగాలు వచ్చాయి.

మరిన్ని వార్తలు