రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు 

3 Dec, 2019 05:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2,346 కోట్ల మేర అదనంగా చెల్లించినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి ఈ ఏడాది జూలైలో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు చెప్పారు. ‘ఈ నివేదిక ప్రకారం 2015–16లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1,331 కోట్లు చెల్లించింది.

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద రూ.84.43 కోట్లు, అడ్వాన్స్‌ కింద రూ.144.22 కోట్లు, జల విద్యుత్‌ కేంద్రం ప్రాజెక్ట్‌ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌ కింద రూ.787 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది..’ అని మంత్రి తెలిపారు. అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాథమికమైనవని నవంబర్‌ 13న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాల్లో ప్రక్రియాపరమైన అతిక్రమణలు లేవని, అధీకృత ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. 

బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ల జాబితాలో రిషికొండ 
దేశంలో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎంపిక చేసిన 13 పైలట్‌ బీచ్‌ల జాబితాలో విశాఖలోని రిషికొండ కూడా ఉన్నట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అంతర్జాతీయ ఏజెన్సీ ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. 

మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలి 
ఈ–సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం, జూదం వంటి మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలన్నదే తమ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆలోచన అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ–సిగరెట్ల నిషేధ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  నికోటిన్‌ గుండెజబ్బు, క్యాన్సర్‌సహా అనేక వ్యాధులకు కారణమవుతున్నందున ఈ–సిగరెట్లను నిషేధించడం పూర్తి సమర్థనీయమని పేర్కొన్నారు.  

ఏపీలో 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం 
భారత్‌ మాల ప్రాజెక్టు కింద ఏపీలో రూ.12,766 కోట్ల వ్యయమయ్యే 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 506 కి.మీ. పొడవునా రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు. 

కడప స్టీల్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాకు అంగీకారమే 
వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బాలశౌరి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాయంతో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ స్టీలు ప్లాంటుకు అతి దగ్గరలోనే బళ్లారి ఐరన్‌ ఓర్‌ లభ్యత ఉంది. అలాగే కృష్ణపట్నం పోర్టు, ఎన్నోర్‌ పోర్ట్‌ల ద్వారా ముడిసరుకు లామ్‌ కోక్‌ను దిగుమతి చేసుకోవచ్చు. దీనిని కేంద్ర మంత్రి పరిశీలిస్తారా?’ అని ప్రశ్నించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ బదులిస్తూ ‘‘నేను ఇటీవల ఏపీకి వెళ్లినప్పుడు మిత్రుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అంతకుముందు ఈ అంశాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వారికి దీర్ఘకాలంపాటు ఎన్‌ఎండీసీ నుంచి ఐరన్‌ ఓర్‌ సరఫరా కావాలి. ఈ ప్రతిపాదనకు కేంద్రం వంద శాతం అంగీకరిస్తోంది. మేం నిరంతరాయంగా సరఫరా చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కడపలో భారీ స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి తగిన పెట్టుబడిదారుడిని వెతుకుతుంది. అలాగే మేం కూడా వైజాగ్‌ ఆర్‌ఐఎన్‌ఎల్‌ ద్వారా ఒక కొత్త స్టీల్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నాం..’అని మంత్రి పేర్కొన్నారు. 

ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయించాలి 
ట్యాక్సేషన్‌ (సవరణ) బిల్లుకు వైఎస్సార్‌సీపీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు 15 శాతం మాత్రమే ఆదాయ పన్ను వర్తింపజేస్తున్న ఈ బిల్లును మా ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు. దీని వల్ల కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. రూ.400 కోట్ల టర్నోవర్‌ పైబడి ఉన్న కంపెనీలకు కూడా.. ముఖ్యంగా భాగస్వామ్య కంపెనీలు, ఎంఎస్‌ఎంఈ కంపెనీలను కూడా తక్కువ పన్ను రేటు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆర్థికవృద్ధి నెమ్మదిస్తున్న ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా మినహాయించాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు