రాజధాని కాంట్రాక్టర్లకు అ‘ధనం’

8 Aug, 2018 04:40 IST|Sakshi

     అదనంగా 5 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు 

     అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు 

     ఆర్థిక, మున్సిపల్, న్యాయ శాఖల అభ్యంతరాలు బేఖాతర్‌

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో కాంట్రాక్టర్లు పవర్‌ఫుల్‌గా తయారయ్యారు. కాంట్రాక్టర్ల మాటే వేదంగా మారిపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ఇతర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కోరిందే∙తడవుగా నిబంధనలు, జీవోలు, చట్టాల్లో సవరణలు జరిగిపోతున్నాయి. టెండర్‌ నిబంధనలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వ్యవహారాలన్నీ భవిష్యత్తులో తమ మెడకు చుట్టుకుంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అమరావతిలో పనులు ఖరీదట! 
అమరావతిలో కాంట్రాక్టర్లకు మెటీరియల్‌ కోసం అంటూ అదనంగా 5 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం గతంలో కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను సవరించడంతోపాటు టెండర్‌ నిబంధనలను సడలించాలని ఆదేశించారు. గతంలో జారీచేసిన జీవోలు 94, 50 ప్రకారం కాంట్రాక్టర్లకు 10 శాతం మాత్రమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించాల్సి ఉంది. టెండర్‌ ఒప్పందం చేసుకున్న తరువాత కాంట్రాక్టు విలువలో 2.50 శాతం, మిషనరీ తెచ్చిన సమయంలో 2.50 శాతం, మెటీరియల్‌ కోసం 5 శాతం.. మొత్తం కలిపి 10 శాతం మాత్రమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించాలి. అయితే రాజధానిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అదనంగా మరో 5 శాతం  చెల్లించాలని ప్రతిపాదించారు. రాజధానిలో పనులు చాలా ఖరీదుతో కూడినవని, స్పెషలైజ్డ్‌ మెటీరియల్‌ కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాల్సి ఉందని, ఇందుకోసం అధికంగా వ్యయం అవుతుందని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొషన్‌ పేర్కొంది. 

టెండర్‌ నిబంధనల్లో సడలింపులు 
కాంట్రాక్టర్లు, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేసిన ప్రతిపాదనను మున్సిపల్‌ శాఖ(సీఆర్‌డీఏ) తిరస్కరించింది. అదనంగా 5 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించడం టెండర్‌ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. టెండర్లు ఖరారైన తరువాత నిబంధనలను సడలించడంతో పాటు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ టెండర్‌ నిబంధనలను సవరించడం, అదనంగా మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయ శాఖ కూడా పేర్కొంది. ఆర్థిక, న్యాయ, మున్సిపల్‌ శాఖల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు లెక్కచేయలేదు. టెండర్‌ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ అగ్రిమెంట్లలో సప్లిమెంటరీ ఒప్పందాలను చేసుకుంటూ బ్యాంకు గ్యారెంటీతో సంబంధం లేకుండా రాజధాని కాంట్రాక్టర్లకు అదనంగా 5 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ అదనపు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల సదుపాయం ప్రస్తుతం రాజధానిలో పనులు చేస్తునన కాంట్రాక్టర్లతోపాటు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లందరికీ వర్తింపజేయాలని సీఎం నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు