పరిశీలించిన అరగంట వ్యవధిలోనే..

14 Nov, 2018 08:11 IST|Sakshi
హుకుంపేట–పాడేరు రోడ్డులో కూలిపోయిన అడ్డుమండ వంతెన కూలక ముందు వంతెన పరిశీలిస్తున్న మాజీ సర్పంచ్‌ మహేష్, గిరిజనులు

కూలిన అడ్డుమండ వంతెన

సాయంత్రమే పరిశీలించిన గ్రామపెద్దలు

త్రుటిలో తప్పిన ప్రమాదం

విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): గ్రామపెద్దలు పరిశీలించిన అరగంట కూడా పూర్తికాకముందే వంతెన కూలి అందరినీ ఆందోళనకు గురి చేసింది. ప్రమాద స్థలిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినప్పటికీ మన్యంలో ఈ ఘటన అలజడి రేపింది. హుకుంపేట– పాడే రు మండలాలకు రాకపోకలు సాగించే రింగ్‌రో డ్డులోని అడ్డుమండ వంతెన మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో వంతెన కదులు తోందని మంగళవారం పలువురు వాహనచోదకులు గ్రామపెద్దలకు తెలియజేశారు. దీంతో అడ్డుమండ సర్పంచ్‌ శెట్టి మహేష్, వైఎస్సార్‌సీపీ నేత కొర్రా వెంకటరమణ, ఇతర గ్రామపెద్దలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వంతెనను పరిశీలించారు. వంతెన దిగువున శిథి లమైన పిల్లర్లను పరిశీలించి అధికారులకు తెలి యజేస్తామన్నారు. వారంతా గ్రామానికి వెళ్లిన అరగంట వ్యవధిలోనే అడ్డుమండ వంతెన నేలకూలింది. వంతెన కూలిన సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పాడేరు–హుకుం పేట రింగ్‌ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలి చిపోయాయి. ఆర్‌అండ్‌బీ ఈఈ టి.రమేష్‌కుమార్‌  కూలిన వంతెనను సాయంత్రం పరిశీలిం చారు. కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

మూడేళ్లుగా గిరిజనుల ఆందోళనలు
ఆర్‌అండ్‌బీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ వంతెన అడుగు పిల్లర్లు కోతకు గురై శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలిపోతోందో అని ఆందోళనతో మూడేళ్లుగా కొత్త వంతెన నిర్మించాలని గిరిజనులు నిరసనలు చేపట్టారు. అడ్డుమండ పంచాయతీ గిరిజనులతో పాటు, పాడేరు మం డలం కుజ్జెలి పంచాయతీ గిరిజనులు పలుమా ర్లు ఆందోళనలు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతిపత్రాలు అందించారు. అయినప్పటి కీ ఫలితం లేకపోయిందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్వరితగతిన వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఉన్నతాధికారులకునివేదిక పంపిస్తా
గ్రామస్తులు పరిశీలించిన అరగంట వ్యవధిలోనే వంతెన కూలిపోవడం ఆందోళన కలిగించింది. అడ్డుమండ వంతెన అభివృద్ధికి రూ.9 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే డైవర్సన్‌ రోడ్డు నిర్మించాలని జేఈఈ నాగేంద్రకుమార్‌ను ఆదేశించాం. కొత్త వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరయ్యేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తా. నిధులు విడుదలైన వెంటనే త్వరితగతిన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం.– టి.రమేష్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ

మరిన్ని వార్తలు