నగదు బదిలీకేదీ ‘ఆధార’ం..?

6 Sep, 2013 04:19 IST|Sakshi

 నల్లగొండ న్యూస్‌లైన్
 అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ గుర్తింపు కార్డు కావాల్సిందే. ప్రతి వ్యక్తికీ యూనిక్ సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ చేయడం ద్వారానే ఇకపై అన్ని రకాల సేవలందించాలని కేంద్రం ముందుకొచ్చిన విషయం విదితమే. ఈ కార్డుతో ప్రధానంగా అనుసంధానమయ్యే పథకం నగదు బదిలీ. అయితే జిల్లాలో అక్టోబర్ నెల నుంచి ఆరంభం కానున్న నగదు బదిలీ పథకం అమలుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో జారీ చేసిన ఆధార్ కార్డులతో పాటు, సమాచారం సేకరించి జారీ చేయని కార్డులు, తాజాగా ఏర్పాటు చేసిన 52 ఆధార్ నమోదు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న సమాచారంతో కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో తెలియడం లేదు. దీంతో ఆధార్ నమోదు పొందని వారిలో గుబులు రేపుతోంది. జిల్లాలో మొత్తం 43లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు కేవలం 29లక్షల 42వేల 420మంది మాత్రమే ఆధార్ కార్డులు నమోదు చేయించుకున్నారు. అక్టోబర్ నుంచే నగదు బదిలీ పథకం అమలు కానుండడంతో మిగతా వారికి ఈ పథకం అమలు గగనకుసుమంగా మారింది.
 
 నగదు బదిలీ పథకం అమలు ఇలా..
 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కోట్లాది రూపాయలు భరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలన్న కోణంపై దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని, ఈ నేపథ్యంలో నగదు బదిలీ పథకం తెరపైకి తీసుకొచ్చి క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగంలోకి దిగింది. అంతకుముందు పలు దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం మన దేశంలో కూడా అమలు చేయాలని సంకల్పించింది. ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే కోణంలో దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన ఓ సంస్థ ద్వారా అధ్యయనం చేయించింది. కిరోసిన్, వంటగ్యాస్, ఎరువులకు చెందిన రాయితీలను ఏవిధంగా వినియోగదారుల ఖాతాలోకి జమచేయాలో సిఫార్సు చేసింది. అందులో భాగంగా రూ.వెయ్యి సబ్సిడీ దాటితే నగదు బదిలీ లబ్ధిదారుని ఖాతాలో జమచేయాలని తీర్మానించారు. ఇదిలా ఉండగా నగదు బదిలీకి ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తుండగా, గ్యాస్, ఫించన్లు, ఎరువులు, పంట రుణాలు, జననీ సంరక్షణ యోజన పథకాలన్నీ నగదు బదిలీ పథకానికి వర్తింపజేయనున్నారు.
 
 తక్షణమే గ్యాస్ సబ్సిడీకి అవకాశం
 వంట గ్యాస్ నగదు బదిలీ పొందడానికి తక్షణమే ఇలా చేయాల్సి ఉంది. ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరిట ఉందో వారికి సంబంధించిన ఆధార్‌నంబరు, బ్యాంక్ అకౌంట్, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ డీలర్లకు అందజేయాలి. ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వనుండగా, సిలిండర్ బుక్ చేసుకోగానే రూ.1022 పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ పొందగానే రూ.535 వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. వాస్తవానికి నగదు బదిలీ పథకాన్ని సెప్టెంబర్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా ఆ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 30వరకు గడువు పొడిగించింది. ఈ లోపు ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, బుక్‌నంబర్, రేషన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పకుండా డీలర్లకు అందజేయాలి. లేకుంటే నగదు బదిలీ పథకానికి అర్హత పొందలేరు.
 
 అక్టోబరు నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ : జేసీ హరిజవహర్‌లాల్
 కలెక్టరేట్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలు అవుతున్నందున గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ నంబర్‌ను బ్యాంక్‌లో తెలియజేయాలని జేసీ హరిజవహర్‌లాల్ కోరారు. గురువారం తన ఛాంబర్‌లో గ్యాస్ ఏజేస్సీలు, బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ సంబంధిత గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఉన్న ఆధార్ లింకేజీ అప్లికేషన్ ఫామ్‌ను తీసుకుని పూర్తి చేసిన వివరాలను, సంబంధిత బ్యాంకులలో అందజేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ ిచంద్రశేఖర్, ఎల్‌పీజీ సేల్స్ ఆఫీసర్ ఉపేందర్, ఐఓసీ డిస్ట్రిబ్యూటర్ వెంకటరమణ, జేమ్స్ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు