‘నాడు నేడు’ పనుల్లో రాజీపడొద్దు

21 Jul, 2020 06:22 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని పాఠశాలలకూ ఫర్నిచర్, ఫ్యాన్లు, శానిటరీ తదితర మెటీరియల్స్‌ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్‌ అయిదో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోగా 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు.

సచివాలయంలోని తన కార్యాలయంలో నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తుండాలని, ఆగస్టు మొదటి వారానికి రాష్ట్రంలో గుర్తించిన 30 డెమో స్కూళ్లలో పనులు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ► నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్ద పథకం అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని మంత్రి తెలిపారు. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ, అభ్యాస మొబైల్‌ అప్లికేషన్, పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర అంశాలపైనా సీఎం సమీక్షిస్తారన్నారు. 
► మంత్రి సమీక్షలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, విద్య, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.       

మరిన్ని వార్తలు