రైతు భరోసా జాబితాలో తన పేరు నమోదుపై స్పందించిన మంత్రి

11 Oct, 2019 15:58 IST|Sakshi

అమరావతి :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం జాబితాలో తన పేరు నమోదుపై  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ అధికారులతో మాట్లాడి వివరణ కోరారు. ఘటనపై విచారణ జరిపించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా జాబితాలో నా పేరు ఉందని ఉదయమే నా దృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైతు భరోసా పథకం సాఫ్ట్‌వేర్‌లో ప్రజాప్రతినిధులు అనే ఆప్షన్‌ లేని కారణంగానే ఈ తప్పు దొర్లింది. నేను రైతునే, నాకు పొలాలు ఉన్నాయి. కానీ పథకానికి ఎవరైతే అర్హులో వారికే సంక్షేమ ఫలాలు అందాలి. ఎక్కడైనా ఇలాంటి తప్పిదాలు జరిగితే వెంటనే తొలగించాలని వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి, ప్రకాశం జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌కి కూడా తెలియజేశాను. ఈ సందర్భంగా తుది జాబితా పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రైతు భరోసా అర్హుల జాబితాను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీంట్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు