మరో హాస్టల్‌ నిర్మిస్తాం

25 Sep, 2019 10:08 IST|Sakshi
హాస్టల్‌లో విద్యార్థినుల గది దుస్థితి ఇదీ.. 

సాక్షి, గుంటూరు : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు పూర్తిస్థాయి వసతులతో నూతన హాస్టల్‌ భవనం నిర్మించేందుకు చర్యలు చేపడతామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా ప్రకటించారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా అనారోగ్యానికి గురైన విద్యార్థినులను సోమవారం పరామర్శించిన ఎమ్మెల్యే ముస్తఫా మంగళవారం మరోసారి సాంబశివపేటలోని విద్యార్థినుల వసతిగృహానికి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వసతిగృహంలో కల్పిస్తున్న సదుపాయాలు, భోజనం గురించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనలో విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వబోమని, వారి ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడ్తామని చెప్పారు. పేదలు చదువుకునే కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో రోజుకు రెండు పూటలా భోజనం, అల్పాహారానికి రూ.47 చొప్పున చెల్లించి విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. దాదాపు 700 మంది విద్యార్థినులు ఇక్కడ ఆశ్రయం పొందుతుండగా, వారికి తగిన వసతి, సదుపాయాలు అందుబాటులో లేకపోవడం శోచనీయమన్నారు. 

సమస్యలు పట్టించుకోని టీడీపీ 
గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం హాస్టల్లో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. హాస్టల్‌ను విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవనం నిర్మించేందుదుకు రెండు మూడు కోట్ల రూపాయలు అవసరమని, నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాద
నలు పంపిస్తామని చెప్పారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, హాస్టల్‌ మరమ్మతులకు తక్షణ అవసరాల కింద రూ.25 లక్షలు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. విద్యార్థి నులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని చీఫ్‌ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ పుల్లారెడ్డితో పాటు వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ముస్తఫా ప్రభుత్వం అండగా ఉందని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. 

116 మంది డిశ్చార్జి
ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వకు గుంటూరు జీజీహెచ్‌లో 131 మంది విద్యార్థినులు చేరారు. మంగళవారం ఉదయానికి 116 మంది ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి చేశారు. మరో 15 మంది చికిత్సపొందుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్టల్‌లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే రాకతో పరిస్థితుల్లో మార్పు
రెండు రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాస్టల్‌ను సందర్శించిన నేపధ్యంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు హాస్టల్‌ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించారు. నగరపాలక సంస్థ అధికా రుల వచ్చి పారిశుద్ధ్య పనులు  చేపట్టారు. 

విద్యాశాఖ మంత్రి దృష్టికి సమస్య 
ఎమ్మెల్యే ముస్తఫా తన ఫోన్‌ ద్వారా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు వీడియో కాల్‌ చేసి వసతిగృహంలో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు విద్యార్థినులతో నేరుగా మంత్రితో మాట్లాడించారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్‌ ఆధునీకరణకు శాశ్వత రీతిలో చర్యలు చేపట్టాలని ఆయన మంత్రిని కోరగా నూతన హాస్టల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్‌బోర్డు ఆర్‌ఐఓ జెడ్‌.ఎస్‌ రామచంద్రరావు, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు షేక్‌ షౌకత్‌ తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థినుల సమస్యలు వర్ణనాతీతం
సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో విద్యార్థుల సమస్యలు వర్ణణాతీతం. అర, కొర వసతులుతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. హాస్టల్‌ ప్రాంగణంలో పాడుపడిన బోరుబావి నీటిని విద్యార్థినులు తాగేం దుకు ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికా రంలో టీడీపీకి మద్దతుదారుడికి ఫుడ్‌ కాంట్రాక్ట్‌ అప్పగించిన కళాశాల కమిటీ పర్యవేక్షణ మరిచింది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు పడిన సందర్భాలు ఉన్నాయని, నాణ్యత లేని బియ్యంతో అన్నం వండుతున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ముస్తఫా ఎదుట వాపోయారు. తమ సమస్యలను డెప్యూటీ వార్డెన్‌ కమలకరుణ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఆమె ఆమె పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కేర్‌ టేకర్‌ సువర్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆర్జేడీ కార్యాలయంలో మంగళవారం కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్‌ వెలగా జోషిని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్, కిరణ్, కబీర్, వినోద్, మహేష్‌ కలిసి వినతి పత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు