-

సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

22 Jul, 2020 03:26 IST|Sakshi

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. (పాఠశాల విద్యకు కొత్త రూపు)

► ఇంగ్లిష్‌ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్‌ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.   రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేయనున్నాం. 
► అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. 
► కడపలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్‌ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.  
► స్కూల్స్‌ ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు మూడో విడత డ్రైరేషన్‌ పంపిణీ కొనసాగించాలని సీఎం ఆదేశించారు.  ఆన్‌ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నాం. ఇకపై ప్రతి ఏటా అకడమిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తాం. 

మరిన్ని వార్తలు