కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు

1 May, 2017 16:42 IST|Sakshi

గుంటూరు: తెలుగుదేశం ప్రభుత్వం కాసుల కోసం, కమీషన్ల కోసం కొత్తప్రాజెక్టులు చేపడుతోందని, రైతులను ఆదుకోవాలనే సదుద్దేశం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. రైతులకు భరోసా, ఆత్మస్థయిర్యం కలిగించేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి దీక్ష చేపట్టారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్‌ జగన్‌ దీక్ష చేపట్టిన వేదికపై ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల కాలంలో ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన విమర్శించారు. టీడీపీ చేసిన మోసాలకు నిరసనగా వైఎస్‌ జగన్ దీక్ష చేపట్టారని, గుంటూరులో ఆయన మూడోసారి దీక్ష చేస్తున్నారని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా నష్టపోయారని, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ నేతలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని, ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశం లేదని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ అకాలమరణం తర్వాత రైతాంగానికి నష్టం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్ కాలంలో 90 శాతం ప్రాజెక్టులను పూర్తి చేశారని, టీడీపీ వాళ్లు తామే పూర్తిచేశామని గొప్పలు చెప్పుకొంటున్నారని ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు