'సిలబస్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి'

21 Apr, 2020 20:10 IST|Sakshi

వీసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆదిమూలపు

2020-21 విద్యాసంవత్సరం పనిదినాలపై కార్యాచరణ 

సాక్షి, అమరావతి : కరోనాతో లాక్‌డౌన్ కారణంగా సిలబస్ పూర్తి కాకపోవటం, పరీక్షలు నిర్వహించలేకపోవటం తదితర అంశాలపై అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లతో  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తికాని సిలబస్‌ను ఆన్‌లైన్‌ ద్వారా భోదన చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తికాని సెమిస్టర్లు ఆన్లైన్ ద్వారా పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

2020-21 విద్యా సంవత్సరంలో పనిదినాలు కోసం పండుగలు ఇతర సెలవుదినాలు కూడా పరిశీలించి మొత్తం పనిదినాలు 220కు తగ్గకుండా చూసుకోవాలన్నారు.క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న హాస్టల్, ఇతర విద్యాశాఖ భవనాలు తిరిగి వినియోగించుకునే ముందు సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులతో యూటిలైజేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు. వాటిని పూర్తి స్థాయి లో శుభ్రపరిచిన తరువాతే భవనాలు వాడుకునేలా చూడాలన్నారు. అన్ని అసోసియేషన్, అనుబంధ కళాశాలల్లో నిబంధనలకు లోబడి ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉన్నత విద్యా సంస్కరణలపై జీవో 63 అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం లో ఇతర దేశాలకు వెళ్లలేని విద్యార్థులు ఇక్కడ కళాశాలల్లో చేరేందుకు అవకాశాలు కోసం చూస్తారన్నారు. దీని వల్ల కోర్సులు, సీట్ల కొరత రాకుండా చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు