అదితి.. ఏమైంది!?

28 Sep, 2015 10:39 IST|Sakshi
అదితి.. ఏమైంది!?

నాలుగు రోజులైనా దొరకని జాడ
అదృశ్యంపై తండ్రి, బంధువుల అనుమానాలు
సీసీ కెమెరాల పుటేజ్ సేకరించనున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు

 
పెదవాల్తేరు: ఆరేళ్ల అదితి గల్లంతు మిస్టరీగా మారింది. డ్రైనేజీలు, గెడ్డలు, సముద్రంలో జల్లెడ పడుతున్నా బాలిక ఆచూకీ శూన్యం. నాలుగు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నా పాప జాడ  తెలియక పోవడంతో తండ్రితో పాటు బంధువలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో 10 బోట్లలో 50 మంది జాలార్లు, డ్రైనేజీల్లో వంద మంది జీవీఎంసీ ఏర్పాటు చేసిన సిబ్బంది. రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వర కు నేవీ హెలికాఫ్టర్, ఇవి కాకకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ పోలీస్ సిబ్బంది అదితి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఇంత మంది వెతుకుతున్నా   ఎక్కడా జాడ కానరాకపోవడంతో తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమోనని తండ్రి, బంధువులు  సందేహం వెలిబుచ్చారు. ఇదే విషయమై ఆదివారం ఎంవీపీకాలనీ పోలీసులకు తమ అభిప్రాయం తెలిపారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, మరో బంధువు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐతో మాట్లాడారు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చని, ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరారు.

 ప్రత్యక్ష సాక్షులు లేరు
 అదితి డ్రైనేజీలో పడిపోవడం ప్రత్యక్షంగా చూసిని సాక్షులు లేరు. ఘటన స్థలంలో స్థానికులను విచారణ చేయగా ఎవరూ చూడలేదని చెప్పడంతో పోలీసులు కూడా చిన్న అనుమానం వ్యక్తం చేశారు. అదితిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన కారు డ్రైవర్ గుర్నాధంను  కూడా విచారించారు. అయితే అదితితో పాటు ట్యూషన్ చదువుతున్న  పన్నెండేళ్ల బాలిక ఇచ్చిన సమాచారం మేరకు అదితి డ్రైనేజీలో పడిపోయిందని పోలీసులు స్పష్టం చేసుకున్నారు. ఇదే విషయాన్ని బాలిక తండ్రికి తెలిపారు. పన్నెండేళ్ల పాపకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు కదా.. కచ్చితంగా  డ్రైనేజీలో పడితేనే ప్రత్యక్ష సాక్షి చెబుతుందని పోలీసులు బాధితులకు వివరించారు.

 ఘటన స్థలం ఎదురుగా సీసీ కెమెరాలు
 భానునగర్‌లో అదితి చదువుతున్న ట్యూషన్ సెంటర్ ఐఓసీ ఇనిస్టిట్యూట్ భవనం ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దిలపాలెం శాఖ ఉంది. ఈ శాఖ ఏటీఎం సెంటర్‌లో సీసీ కెమెరాలు  ఉన్నాయి. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అదితి అదృశ్యమైంది. ఆ సమయంలో విద్యుత్ కూడా లేదు. అయినప్పటికి  ఏటీఎంలో ఇన్వెర్టర్  ఉన్నందున వీడియో రికార్డ్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలు పుటీజ్‌లు సోమవారం సేకరించేందుకు ఎంవీపీకాలనీ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సీసీ కెమెరాల్లో  రికార్డ్ అయివుంటే అదితి అదృశ్యం మిస్టరి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

 బ్యాగ్ జాడా లేదు
 అదితి అదృశ్యమైన సమయంలో ఆమె భుజానికి స్కూల్ బ్యాగ్ ఉంది.  డ్రైనేజీలో బ్యాగ్‌తో సహా కొట్టుకుపోతే ఆ బ్యాగు కూడా   లభ్యం కాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం స్కూల్ బ్యాగ్ పొదల్లోనో, రాళ్ల సందుల్లోనో లభ్యమవ్వాలి కదా అని చెప్పుకుంటున్నారు.  

 కొనసాగుతున్న గాలింపు
 ఆదివారం కూడా అదితి ఆచూకి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. గెడ్డలు, సముద్రంలో విసృ్తతంగా పరిశీలించారు. నేవీ సిబ్బంది సహకారంతో బోట్లపై సముద్రంలో గాలించారు.   నేవీ హెలికాఫ్టర్ తీరప్రాంతం రుషికొండ నుంచి ఆర్కె బీచ్ వరకు చక్కర్లు కొట్టి అనువణువు గాలించింది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్‌కుమార్  పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరగుతున్నాయి.
 
అనుమానాలు లేవు
 అదితి అదృశ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలు లేవు. ఘటన వద్ద స్థానికులు, బాలికను తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ కూడ  డ్రైనేజీలో పడిపోవడం చూడలేదని చెప్పారు. అయితే కలిసి వచ్చిన పన్నెండేళ్ల పాప అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లార చూసింది. ఇద్దరూ కలిసి ట్యూషన్ నుంచి బయటకు వస్తుండుగా మ్యాన్‌హోల్ తెరిచి ఉన్న డ్రైనేజీలో పడిపోయిందని ఆ పాప తెలిపింది. అదితి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.
 - విద్యాసాగర్, సీఐ ఎంవీపీకాలనీ.
 
విశాఖపట్నం సిటీ: ఆరేళ్ల చిన్నారి అదితి జాడ కోసం ఆదివారం రాత్రి వరకూ గాలించినా  ఫలితం లేకపోవడంతో  సోమవారం రాత్రి వరకూ మరింత విస్తృతంగా  గాలించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గాలింపు చర్యలు పూర్తయిన పిదప ఉన్నతాధికారులంతా ఈ  నాలుగైదు రోజులుగా చేసిన కసరత్తుపై చర్చించి తదుపరి ఏ కోణంలో దర్యాప్తు చేపట్టాలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి గాలింపు కొనసాగించాలా లేక ఇతర కోణాల్లో దర్యాప్తు మొదలెట్టాలా అనేది నిర్ణయిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 300 మందికిపైగా నిపుణులు ఈ ఆపరేషన్‌లో పాల్గొని అణువణువు గాలిస్తున్నారు. అయినా 72 గంటలు గడచినా అదితి ఆచూకీ కనబడలేదు. నావికాదళ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. అదితి జాడ ఎలా అయినా పసిగట్టాలని నేవీ హెలీకాఫ్టర్లు, ఛాపర్‌లు, మర పడవలు, బోట్లు, సాయంతో గాలింపు తీవ్రతరం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అదితి కోసం బీచ్‌రోడ్డు అంతా తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం నాటికే ఆమె జాడ తెలుస్తుందని గట్టిగా నమ్మిన జీవీఎంసీ వర్గాలు ఆదివారం కూడా పాప జాడ లేకపోవడంతో మరింత లోతుగా వెదుకుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు